పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్ | Five Percent Increase Sales of Houses | Sakshi
Sakshi News home page

పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్

Published Sun, Oct 6 2024 6:56 AM | Last Updated on Sun, Oct 6 2024 9:06 AM

Five Percent Increase Sales of Houses

ఆఫీస్‌ లీజింగ్‌ సైతం 18 శాతం వృద్ధి

ఎనిమిది టాప్‌ పట్టణాలపై నైట్‌ఫ్రాంక్‌ నివేదిక

హైదరాబాద్‌లో ఉత్సాహంగా ఇళ్ల అమ్మకాలు

నీరసించిన ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5 శాతం పెరిగాయి. ఇదే కాలంలో ఆఫీస్‌ వసతుల (స్పేస్‌) లీజింగ్‌ సైతం 18% పెరిగింది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఎనిమిది పట్టణాలకు సంబంధించిన డేటాను రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా విడుదల చేసింది. ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్‌ కాలంలో 87108 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 82,612 యూనిట్లుగా ఉన్నాయి.

స్థూల ఆఫీస్‌ లీజింగ్‌ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ పట్టణాల్లో 18% పెరిగి 19 మిలియన్‌ చదరపు అడుగులకు (ఎస్‌ఎప్‌టీ) చేరింది. బహుళజాతి కంపెనీలు, గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్ల (జీసీసీ) నుంచి అధిక డిమాండ్‌ నెలకొంది. జూలై–సెప్టెంబర్‌లో ఇళ్ల అమ్మకాలు పెరిగాయన్న అనరాక్, ప్రాప్‌ ఈక్విటీ సంస్థల అంచనాలకు భిన్నంగా నైట్‌ఫ్రాంక్‌ గణాంకాలు ఉండడం గమనార్హం. ‘‘2024లో ఇళ్ల మార్కెట్‌లో సానుకూల ధోరణి  నెలకొంది. క్యూ3లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి’’అని నైట్‌ఫ్రాంక్‌ నివేదిక తెలిపింది. రూ.1 కోటికి మించి ధర కలిగిన ప్రీమియం ఇళ్లకు ఏర్పడిన డిమాండ్‌ అమ్మకాల వృద్ధికి సాయపడుతున్నట్టు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ వెల్లడించారు. అందుబాటు ధరల విభాగంలో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్టు చెప్పారు. ఇళ్ల లభ్యత, వాటి ధరల పరంగా సవాళ్లు నెలకొన్నట్టు తెలిపారు.  

జీసీసీల ముఖ్య భూమిక
‘‘భారత్‌లో వ్యాపార సంస్థలు, జీసీసీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. వృద్ధిలో వీటిదే ప్ర ముఖ పాత్ర. ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ ఇదే ధోరణి ఉంటుందని అంచనా వేస్తున్నాం. 2024 మొత్తం మీద ఆఫీస్‌ స్థలాల లీజింగ్‌ 70 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని అధిగమించొచ్చు. నికరంగా 10 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఎక్కువ. క్రితం ఏడాది కంటే 20% అధికం. అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా భారత్‌ అభివృద్ధి చెందుతుండడాన్ని ఈ అసాధారణ వృద్ధి తెలియజేస్తోంది’’అని శిశిర్‌ బైజాల్‌ వివరించారు.  

హైదరాబాద్‌లో 9 శాతం వృద్ధి
➤హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 2024 జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికంలో 9 శాతం పెరిగి 9,114 యూనిట్లుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 26 శాతం తగ్గి 2.2 మిలియన్‌ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్‌ 2.9 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం.  

➤ముంబై మార్కెట్లో రికార్డు స్థాయిలో 24,222 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల కంటే 9 శాతం ఎక్కువ.  కానీ, ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ మాత్రం 17 శాతం తగ్గిపోయి 2.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.  
    
➤బెంగళూరులో 11 శాతం వృద్ధితో 14,604 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ ఇక్కడ రెండున్నర రెట్లు పెరిగి 5.3 మిలియన్‌ చదరపు అడుగులకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్‌ 2.1 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది.

➤పుణెలో ఇళ్ల అమ్మకాలు కేవలం ఒక శాతమే పెరిగి 13,200 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్క డ కార్యాలయ స్థలాల లీజింగ్‌ 14 శాతం క్షీణించి 2.6 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.

➤అహ్మదాబాద్‌లో 11 శాతం వృద్ధి నమోదైంది. 4,578 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ సైతం 69 శాతం వృద్ధిని నమోదు చేసింది. 0.3 మిలియన్‌ చదరపు అడుగుల లీజింగ్‌ లావాదేవీలు చోటుచేసుకున్నాయి.  

➤కోల్‌కతాలోనూ 14 శాతం అధికంగా 4,309 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. స్థూల ఆఫీస్‌ స్థలాల లీజింగ్‌ 38 శాతం తక్కువగా 0.18 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.

➤ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 7 శాతం తగ్గాయి. 12,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ, ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 26 శాతం పెరిగి 3.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.

➤చెన్నైలో 4,105 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాల కంటే 6 శాతం తక్కువ. చెన్నైలో ఆఫీస్‌ స్పేస్‌ 35 శాతం వృద్ధితో 2.6 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.

➤జూలై–సెప్టెంబర్‌ కాలంలో మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో జీసీసీలు తీసుకున్నదే 37 శాతం (7.1 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ)గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement