తుర్కియే - సిరియా భూకంప బాధితులకు అండగా నిలుస్తోన్న ఇండియన్ ఆర్మీ మేజర్ బీనా తివారీపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఇది భారత్ ఇమేజ్ అంటూ తాజాగా బీనా ఓ బాలికను కాపాడిన చిత్రాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తుర్కియే, సిరియాలో గతవారం సంభవించిన భారీ భూకంపంలో మృత్యువిలయం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 41వేలకు చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. భూకంపం సంభవించి తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల ఆర్తనాధాలు వినిపిస్తున్నట్లు స్థానిక మీడియా కథనాల్ని ప్రచురించింది.
ఇక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న భూకంప బాధితులకు భారత్ భరోసా ఇస్తోంది. 'ఆపరేషన్ దోస్త్' పేరుతో మీకు మేమున్నాం’ అంటూ గడ్డకట్టే చలిలోనూ ఇండియన్ ఆర్మీ సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా భారత్ నుంచి సహాయక చర్యల కోసం అక్కడికి వెళ్లిన మేజర్ బీనా తివారీ సేవలపై స్థానికుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆమె తమపట్ల చూపిస్తున్న ఆత్మీయతకు తుర్కియే వాసులు కరిగిపోతున్నారు. తుర్కియే మహిళ బీనా తివారీని ప్రేమగా ముద్దాడిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆ చిత్రాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. తాజాగా ఆమె ఓ బాలికను కాపాడిన చిత్రాల్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అదిపెద్ద సైన్యాల్లో భారత్ ఒకటి. సహాయకచర్యలు, పీస్‌కీపింగ్‌లో మనకు దశాబ్దాల అనుభవం ఉంది. ఇదీ భారత్ ఇమేజ్’ అని ప్రశంసించారు.
ఎవరీ మేజర్ బీనా తివారీ
28 ఏళ్ల ఇండియన్ మేజర్ బీనా తివారీ తుర్కియే భూకంప బాధితురాల్ని కాపాడింది. అందుకు కృతజ్ఞతగా బుగ్గన ముద్దు పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ ఫోటోను ఇండియన్ ఆర్మీ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా..ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు.
డెహ్రాడూన్‌కు చెందిన బీనా తివారీ కుటుంబ సభ్యులు మొత్తం దేశానికి సేవలందిస్తున్నారు. ఇప్పటికే బీనా తివారీ తాత కైలానంద్ తివారీ (84) కుమావ్ రెజిమెంట్ సుబేదార్‌గా సేవలందించి రిటైర్ అయ్యారు. ఆమె తండ్రి మోహన్ చంద్ర తివారీ (56) అదే రెజిమెంట్‌లో సుబేదార్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆమె భర్త కూడా వైద్యుడే. ప్రస్తుతం ఆమె కల్నల్ యదువీర్ సింగ్ ఆధ్వర్యంలో అస్సాంలో పనిచేస్తున్నారు.
ఇండియన్ ఆర్మీ ఫిబ్రవరి 7న తుర్కియే - సిరియా క్షతగాత్రుల్ని కాపాడేందుకు 99 మంది వైద్య నిపుణుల బృందాన్ని అక్కడికి పంపిన విషయం తెలిసిందే. వారిలో మేజర్ బీనా తివారీ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment