కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆదాయపు పన్ను చెల్లించే అసెస్సీలకు ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. ఇటు కోవిడ్ అటు వెబ్‌సైటు మొరాయించడం తదితర కారణాల వల్ల ఎన్నో అంశాల్లో గడువు పొడిగించింది. దీనితో తొందరపడకుండా నిదానంగా మన పని చేసుకోవచ్చు. ఉద్యోగికి ఊరటనిచ్చే విషయాలు ఓసారి చూస్తే..
కోవిడ్ నేపథ్యంలో చాలా మంది యజమానులు తమ కింద పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా సహాయం చేశారు. కొంతమంది.. ఉద్యోగులను ఆదుకున్నారు. కొంతమంది కోవిడ్ చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టారు. తాజా మార్పుల ప్రకారం 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లోనూ, ఆ తర్వాత యజమాని ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ఉద్యోగి విషయంలో మినహాయింపుగా భావిస్తారు. దీనిపరంగా ఉద్యోగికి ఎటువంటి పన్ను భారం ఉండదు.
ఎవరైనా ఉద్యోగి కోవిడ్ బాధితుడై మరణిస్తే, ఆ సమయంలో యజమాని ఆ కుటుంబానికి ఇచ్చిన నష్టపరిహారం.. ఎక్స్‌గ్రేషియా మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. ఇది కూడా ఊరట కలిగించే అంశమే. పాన్ కార్డుతో, ఆధార్ అనుసంధానానికి గడువు తేది 2021 జూన్ 30. దీన్ని కూడా కేంద్రం 2021 సెప్టెంబర్ 30 దాకా పొడిగించింది. ఇక్కడ సమస్య సమయానిది కాదు. ఆధార్ నిర్వాహకులు, ఇన్‌కం ట్యాక్స్ విభాగం మధ్య సమాచారం విషయంలో సయోధ్య, సహకారం లేకపోవడమే ఇందుకు కారణం. ఎవరి మటుకు వారే తమ సమాచారమే కరెక్ట్ అని, సర్దుబాటుకు ఒప్పుకోవడం లేదు. అసెసీ మాట విన డం లేదు. అసెసీ నుంచి ఒక డిక్లరేషన్ తీసుకుని ముగించాల్సిన అనుసంధాన ప్రక్రియను ‘అసెస్‌మెంట్‘ అంత కష్టం చేస్తున్నారు. దీని పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది.
ముందుగా చెప్పినట్లు చాలా అంశాల్లోలాగే ‘వివాద్ సే విశ్వాస్’ పథకం కింద చెల్లింపులకు కూడా గడువు తేదిని పొడిగించారు. అయితే, మరింత సమయం లభిస్తున్నప్పటికీ.. మీరు తగిన సమాచారం, కాగితాలతో సిద్ధంగా ఉండటం శ్రేయస్కరం. ఆ తర్వాత పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండదు. మూలధనం మీద పన్ను లెక్కించడం కోసం, మినహాయింపు పొందడం కోసం ఇల్లు కొనడం, బాండ్లు కొనడం వంటి వాటికి మీమీ లావాదేవీలను బట్టి గడువు ఉంటుంది. ఈ గడువును 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 దాకా పొడిగించారు. ఉదాహరణకు బాండ్లు కొనడానికి గడువు తేది 30–6–2021తో ముగిసినట్లయితే, దాన్ని ఇప్పుడు 30–9–2021 దాకా పొడిగించారు. మీరు బాండ్లను 30–9–2021లోగా కొని, మూలధన లాభాల విషయంలో మినహాయింపులు పొందవచ్చు. ప్రస్తుతానికైతే ఇవి ఊరట కలిగించే అంశాలు. సందేహం లేదు. సమయానుకూలంగా గడువు తేదిని మళ్లీ పొడిగించవచ్చు. కానీ దాని కోసం ఎదురు చూడకుండా అన్నీ అమర్చుకుని సిద్ధంగా ఉండండి. వెబ్‌సైటు అందుబాటులోకి రాగానే ఫైల్ చేయండి.
కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి కె.వి.ఎన్ లావణ్య
ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment