ఎస్. ఊహించినట్లుగానే జరిగింది. కొద్ది సేపటి క్రితమే కేంద్ర మంత్రుల బృందం ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో,రేస్ కోర్స్‌లపై 28శాతం జీఎస్టీ విధించేలా సిఫార్స్ చేసినట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీనిపై త్వరలో మంత్రుల బృందం నివేదికను సమర్పించే అవకాశం ఉంది.
అయితే కేంద్ర మంత్రుల సిఫార్స్‌లపై స్కిల్‌గేమింగ్ పరిశ్రమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్‌టీ రేటునే కొనసాగించాలని డిమాండ్ చేసింది. ప్రతిపాదిత 28 శాతం పన్ను పరిధిలోకి మారిస్తే 2.2 బిలియన్ డాలర్ల పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వం అధిక పన్ను పరిధిలోకి చేర్చడం వల్ల పరిశ్రమ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ, భారత పన్ను చట్టం పరిధిలోకి రాని వాటిని ప్రోత్సహించినట్టు అవుతుందని గేమ్స్ 24ఇంటూ7 సీఈవో త్రివిక్రమ్ తంపి పేర్కొన్నారు. ‘‘ఇది ముప్పేట ప్రభావాన్ని చూపిస్తుంది. పరిశ్రమ నష్టపోతుంది. ప్రభుత్వం పన్ను ఆదాయం రూపంలో నష్టపోతుంది. విశ్వసనీయత లేని ఆపరేటర్ల చేతుల్లో పడి ఆటగాళ్లు నష్టపోతారు’’అని తంపి అభిప్రాయపడ్డారు.
400 సంస్థలతో 45,000 మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమకు 18 శాతం జీఎస్‌టీనే కొనసాగించాలని ఆన్‌లైన్ స్కిల్ బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల సమాఖ్య ఇప్పటికే అధికారులకు వినతిపత్రాన్ని కూడా సమర్పించింది. ఈస్పోర్ట్స్, ఫాంటసీ గేమ్స్, రమ్మీ, పోకర్, చెస్ ఇవన్నీ కూడా ఆన్‌లైన్ స్కిల్ గేమ్‌ల కిందకు వస్తాయి. ఈ తరహా ఆటలు ఉచితంగా లేదంటే ప్లాట్‌ఫామ్ ఫీజుల రూపంలో నడుస్తుంటాయి. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్ సేవలను 18 శాతం నుంచి 28 శాతం జీఎస్‌టీ శ్లాబులోకి మార్చాలన్న ప్రతిపాదనపై జీఎస్‌టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment