జీఎస్‌టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో అతి తక్కువ పన్ను శ్లాబ్ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఆదాయాలు పెరిగి రాష్ట్రాలు నష్ట పరిహారం కోసం కేంద్రంపై ఆధారపడకుండా ఉండటానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వ్యవస్థలో మార్పులు చేయాలని చూస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అతి తక్కువ శ్లాబ్ 5 శాతంను పెంచడంతో పాటు ఆదాయాన్ని పెంచడానికి వివిధ చర్యలను సూచిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం ఈ నెల చివరినాటికి తన నివేదికను జీఎస్‌టీ మండలికి సమర్పించే అవకాశం ఉంది.
5 నుంచి 8కి..
ప్రస్తుతం, జీఎస్‌టీ కింద 5, 12, 18 & 28 శాతం పన్ను రేటు గల 4 శ్లాబులు ఉన్నాయి. కొన్ని అత్యావశ్యక వస్తువులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తే, మరికొన్ని వాటి మీద అతి తక్కువ మాత్రమే పన్ను విధిస్తున్నారు. ఇంకా లగ్జరీ, డీమెరిట్ ఐటమ్ ఉత్పత్తులకు అత్యధికంగా 28 శాతం పన్ను వర్తిస్తుంది. జీఎస్‌టీ తీసుకొచ్చిన కారణంగా రాష్ట్రాలు నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి కొత్తగా జీఎస్‌టీ పన్ను వ్యవస్థలో మార్పు చేయాలని కేంద్రం భావిస్తుంది. 5 శాతం శ్లాబును 8 శాతానికి పెంచడం ద్వారా కేంద్రానికి అదనంగా రూ.1.50 లక్షల కోట్ల వార్షిక ఆదాయం రావచ్చు అని అధికార వర్గాలు తెలిపాయి.
ఆ సంఖ్యను కూడా తగ్గించాలి
ప్రధానంగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై విధిస్తున్ శ్లాబును 1 శాతం పెంచడం ద్వారా వార్షికంగా రూ.50,000 కోట్ల ఆదాయ లాభం లభిస్తుంది. హేతుబద్ధీకరణలో భాగంగా 5 శాతం రేటును 8 శాతంగాను, 12 శాతం రేటు గల వస్తువులను 18 శాతం శ్లాబులో కలపాలని, 28 శాతం రేటును యధాతథంగా ఉంచాలని కేంద్రం భావిస్తుంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, ప్రస్తుతం 12 శాతం పన్ను విధించే అన్ని వస్తువులు మరియు సేవలు 18 శాతం శ్లాబ్ కిందకు మారతాయి. అంతేకాకుండా, జీఎస్‌టీ నుంచి మినహాయించిన వస్తువుల సంఖ్యను తగ్గించాలని కూడా జివోఎం ప్రతిపాదించింది.
జూన్ నెలతో గడువు ముగింపు
ప్రస్తుతం అన్ ప్యాకేజ్డ్, అన్ బ్రాండెడ్ ఫుడ్ & డైరీ ఐటమ్స్'కు జీఎస్‌టీ నుంచి మినహాయింపు లభిస్తుంది. జీఎస్‌టీ కౌన్సిల్ ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ప్రారంభంలో సమావేశమై జివోఎం నివేదికపై చర్చించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని వర్గాలు తెలిపాయి. గత కొన్ని ఏళ్లుగా జీఎస్‌టీ అమలులోకి తీసుకొని రావడం వల్ల రాష్ట్రాలు నష్టపోయే ఆదాయాన్ని కేంద్రమే చెల్లిస్తుంది. ఈ ప్రక్రియకు జూన్ నెలతో గడువు ముగిస్తుంది. జీఎస్‌టీ నష్టపరిహార ప్రక్రియ ముగింపుకు రావడంతో రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్రం జీఎస్‌టీ పన్ను వ్యవస్థలో మార్పులు చేయాలని భావిస్తుంది.
జూలై 1, 2017న జీఎస్‌టీ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి జూన్ 2022 వరకు రాష్ట్రాలకు 5 సంవత్సరాల పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. 2015-16 సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా చేసుకొని సంవత్సరానికి 14 శాతం వృద్దిని పరిగణలోకి తీసుకొని నష్టాన్ని లెక్కిస్తామని కేంద్రం అంగీకరించింది. అయితే, అనేక వస్తువులపై జీఎస్‌టీ తగ్గడం వల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గింది. కొన్ని సంవత్సరాలుగా జీఎస్‌టీ కౌన్సిల్ తరచుగా వాణిజ్యం & పరిశ్రమలకు అనుగుణంగా పన్ను రేట్లను సవరించింది. ఉదాహరణకు, జీఎస్‌టీ అమలులకి వచ్చిన కొత్తలో 28 శాతం పన్ను శ్లాబుల ఉన్న సంఖ్య 228 అయితే.. ప్రస్తుతం ఆ సంఖ్య 35కు తగ్గింది.
(చదవండి: సామాన్యులకు మరో కొత్త టెన్షన్.. ఇక మనం వాటిని కొనలేమా?)
Comments
Please login to add a commentAdd a comment