ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా - హురున్ ఇండియా సంస్థలు సంయుక్తంగా భారత్‌లోనే అత్యంత సంపన్నులైన 100 మంది మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రోష్ని నాడార్, ఫల్గుణి నాయర్‌లు వరుస స్థానాల్ని దక్కించుకున్నారు.
♦ సంపన్నుల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330కోట్లతో తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
♦ బ్యాంకింగ్ రంగం నుంచి అనూహ్యంగా నైకా పేరుతో కాస్మోటిక్స్ రంగంలో రాణిస్తున్న ఫల్గుణి నాయర్ రూ.57,520 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఏడాదిలో ఆమె వెల్త్ 963 శాతం పెరిగినట్లు విడుదలైన నివేదిక పేర్కొంది.
♦ బయోకాన్ ఛైర్ పర్సన్ కిరణ్ మంజుదార్ షా వెల్త్ 21శాతం తగ్గి రూ.29,030 కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్‌లో 12మంది మహిళలు
మహిళా సంపన్నుల జాబితాలో అత్యధికంగా ఢిల్లీ నుంచి 25 మంది, ముంబై నుంచి 21మంది ,హైదరాబాద్ నుంచి 12 మంది ఉన్నారు. భారతదేశంలోని టాప్ - 100 మంది ధనవంతులైన మహిళలలో ఫార్మాస్యూటికల్స్ రంగం నుంచి 12 మంది, హెల్త్‌కేర్ నుంచి 11 మంది, కన్స్యూమర్ గూడ్స్ రంగం నుంచి 9 మంది మహిళలున్నారు.
హైదరాబాద్‌లో దివీస్ లాబోరేటరీస్ డైరక్టర్ నీలిమా రూ.28,180కోట్లతో తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రూ.5,530కోట్లతో బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, రూ.2,740కోట్లతో శోభన కామినేని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
చివరిగా భోపాల్ జెట్‌సెట్‌గోకు చెందిన 33ఏళ్ల కనికా తెక్రివాల్ 50 శాతం సంపదతో రూ.420 కోట్లతో జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు.
సంస్థల్లో ఉన్నత స్థాయిలో..
సంపన్నుల జాబితాలో ఆయా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహించిన మహిళలు సైతం ఉన్నారు. వారిలో మాజీ పెప్సికో సీఈవో ఇంద్రా నూయి రూ. 5,040 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్ డైరెక్టర్‌గా రేణు సుద్ కర్నాడ్ రూ. 870 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం రూ.320 కోట్లతో వరుస స్థానాల్ని కైవసం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment