
హైదరాబాద్: భారత సంస్కృతిలో నమస్కారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎదుటివారిని ఆహ్వానిస్తూ.. పలకరిస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించడం సంప్రదాయంలో భాగం. దీన్ని గుర్తిస్తూ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యందాయ్ ఇండియా ఒక వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 మీటర్ల ఎత్తయిన నమస్కార రోబోను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు నమస్కారంతో స్వాగతం పలుకుతుంది.
ఒక మనిషి చేయి, ఒక రోబో చేయి కలిసిన ప్రతిరూపంగా ఇది కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. మానవత్వం, టెక్నాలజీ ఈ రెండూ కలసి మెరుగైన భవిష్యత్తుకు ప్రతిరూపమని తెలియజేయడమే దీని ఏర్పాటులోని ఉద్దేశమని పేర్కొంది. ‘‘భారత్‌లో మనుషులు, టెక్నాలజీ మధ్య అంతరం పూడ్చడమే హ్యుందాయ్ అసలైన విజన్. దీన్ని ప్రతిబింబించే రూపమే ఈ ఏర్పాటు’’అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూకిమ్ తెలిపారు.