హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది.
తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్‌యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్‌యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్‌యూవీలైన సీఆర్-వి, బీఆర్-వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్-వి, జాజ్ ఎస్‌యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది.
నిష్క్రమించే ఆలోచనే లేదు..
హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్‌తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment