దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో (హైదరాబాద్ సహా) ఇళ్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు ఇక్రా తెలిపింది. 68.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు విక్రయమయ్యాయి.
కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలోని విక్రయాలతో పోలిస్తే 19 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి)లో 84.7 మిలియన్ చదరపు అడుగుల ఇళ్లు అమ్ముడుపోయాయని.. 2011–12 సంవత్సరం నుంచి చూస్తే రెండో అత్యధిక త్రైమాసికం అమ్మకాలుగా ఇక్రా తన నివేదికలో తెలిపింది. ఈ అధిక బేస్ కారణంగా.. జూన్ త్రైమాసికంలో విక్రయాల క్షీణత కనిపిస్తోందని వివరించింది. నివాస గృహాల విక్రయాలు 2020 జూన్ త్రైమాసికంలో 33.7 మిలియన్ చదరపు అడుగుల మేరే అమ్ముడుపోవడం గమనార్హం. ఆ విధంగా చూస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది.
రానున్న రోజుల్లో మంచి డిమాండ్
దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం కొనసాగుతుండడం, ఆర్థిక కార్యకలాపాలను అనుమతించడం వల్ల స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి ఇళ్ల విక్రయాలు ఇంకా పుంజుకుంటాయని ఇక్రా అంచనా వేసింది. అంతర్గతంగా డిమాండ్ ఈ పరిశ్రమలో నెలకొని ఉన్నట్టు తెలిపింది. కనిష్టాల్లో రుణాల రేట్లు, కార్యాలయంతోపాటు ఇంటి నుంచి కూడా పనిచేసుకోగలిగిన వాతావరణం వల్ల ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment