వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో పిల్లల శ్వాస, నాడీ వ్యవస్థలను వాయు కాలుష్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. దాంతో పిల్లల్లో న్యుమోనియా కేసులు అధికమవుతున్నాయి. పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం వాతావరణంలోనూ అనూహ్య మార్పులు తీసుకొస్తోంది. మొత్తంగా ఇది కంటికి కనిపించని శత్రువుగా పరిణమించింది. భారత్‌లోనూ ఈ సమస్య పోనుపోను తీవ్రతరమవుతోంది.
పర్యావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయంగా పెట్రోల్, డీజిల్‌లతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ కూడా 2024 జనవరి ఒకటో తేదీ (సోమవారం) నుంచి డీజిల్, పెట్రోల్‌లతో నడిచే వాహనాలను కొనుగోలు చేయవద్దని ఆదేశించారు.
ఈ నిర్ణయం ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంతోపాటు ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ శాఖలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనాలంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 185, ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలు 2733గా ఉందని సీఎం తెలిపారు.
ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఏటా వాయు ప్రమాణాలను అధ్యయనం చేస్తోంది. దాని ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రూపొందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన నివేదికలో ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment