సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి మార్కెట్ పరుగులు తీస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు మధ్యలో కోవిడ్ ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకుంది. నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపుతో మరింత వేగంగా సాగుతోంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకొని విశ్వనగరంగా రూపాంతరం చెందేందుకు సరికొత్త పోకడలతో విస్తరిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే నివాస ఖర్చులు తక్కువ కావడంతో ఉపాధి వలసలు అధికం కావడంతో పాటు ఇక్కడే శాశ్వత నివాసాల కోసం ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు పరిశ్రమలు తరలిరావడంతో గృహ, వాణిజ్య నిర్మాణాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా స్థిరాస్తి రంగం జోరు కొనసాగుతోంది.
లక్షన్నరకుపైనే దస్తావేజులు
► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2022– 23 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో సుమారు లక్షన్నరకు పైగా దస్తావేజులు నమోదైనట్లు రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కేవలం శివారు ప్రాంతాల్లోనే 1.20 లక్షల లావాదేవీలు జరగడంతో భారీగా ఆదాయం సమకూరింది. గతేడాదితో పోల్చితే సుమారు 46 శాతం పైగా లావాదేవీల సంఖ్య పెరిగినట్లయింది. గతేడాది ఏప్రిల్, జూన్‌లో దస్తావేజులు నమోదు సంఖ్య భాగా పెరిగినా.. కోవిడ్ వైరస్ వ్యాప్తితో మే నెలలో మాత్రం కేవలం 25 శాతానికి పరిమితమైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
► ప్రస్తుతం శివారు పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దినసరి రిజిస్ట్రేషన్ల సంఖ్య మూడు అంకేలు దాటుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఫరూక్‌నగర్, మహేశ్వరం, గచ్చిబౌలి, చంపాపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మేడ్చల్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, గండిపేట పరిధుల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
భవిష్యత్‌పై భరోసాతో..
కోవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టి భవిష్యత్తుపై భరోసా కనిపిస్తుండటంతో క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ భారీ కొత్త ప్రాజెక్టు వస్తుండటంతో కొనుగోలుదారులు మరింత ఆసక్తి కనబర్చుతున్నారు. భూములు, ఇళ్ల ధరలు పెరుగుతుండటమే తప్ప తగ్గే అవకాశం లేదనే అంచనాలతో స్థిరాస్తి రంగం మరింత వేగం పుంజుకునట్లయింది. సామాన్యులతోపాటు ఐటీ ఉద్యోగులు ఇళ్లు కొనడమే కాదు.. పెట్టుబడులు సైతం వెనుకాడటం లేదు. గృ హ అద్దెలతో పోలిస్తే అద్దెల రాబడి అధికంగా ఉంటుందని స్థిరాస్తి రంగం వైపు మొగ్గు చూపడం అధికమైంది.
మెట్రోతో...
మెట్రో రవాణా అందుబాటులోకి రావడం కూడా స్థిరాస్తి రంగానికి కలిసి వచ్చినట్లయింది. ముఖ్యంగా ఉప్పల్, ఎల్‌బీ నగర్ మార్గం వైపు కూడా కొనుగోలు దారులు ఆసక్తి పెరిగింది. వరంగల్ రహదారి మార్గంలో ఘట్‌కేసర్ వరకు వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. పశ్చిమంలోని ఐటీ కేంద్రానికి సైతం గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో ఉద్యోగులు ఇటువైపు ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి మీదున్న ఎల్‌బీనగర్ వరకు మెట్రో రవాణా సదుపాయం ఉండటంతో నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగింది.
శివారుపై ఆసక్తి
నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు, ఫ్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇండిపెండెంట్ గృహాలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి మరింత ఊపొచ్చినట్లయింది. బాహ్యవలయ రహదారి బయట టౌన్‌షిప్‌లు, వందల ఎకరాల్లో వెంచర్లు. పెద్ద సంస్థల కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు మరింత జీవం పోస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఓఆర్‌ఆర్ బయట భారీ ప్రాజెక్ట్లను ప్రకటించాయి. గతంలో స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు కార్యాలయానికి, ప్రధాన వాణిజ్య కేంద్రానికి ఎంత దూరమని ఆలోచన ఉండేది. రహదారుల వంటి మౌలిక వసతులు మెరుగుపడటంతో కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
తరలి వస్తున్న పరిశ్రమలు
ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు పలు కంపెనీలు తరలివచ్చాయి. వాటి సమీప ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాల హోరు కొనసాగుతోంది. కొండాపూర్, కోకాపేట్, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ , ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. (క్లిక్: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి)
Comments
Please login to add a commentAdd a comment