చెన్నై: విజయవంతమైన ప్రతి స్టార్టప్ మొదట విద్యార్థుల మెదడులో మొదలైన ఆలోచనే. అలాంటి ఆలోచనలు ఆవిష్కరణలై అభివృద్ధి చెంది మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయి. ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటైన ప్రీ-ఇంక్యుబేటర్ ‘నిర్మాణ్’.. యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ, వారికి మార్గనిర్దేశం చేస్తోంది. దీని ద్వారా పురుడు పోసుకున్న స్టార్టప్‌లను ప్రదర్శించేందుకు ఐఐటీ మద్రాస్ మొట్టమొదటిసారిగా 'నిర్మాణ్ డెమో డే 2024' కార్యక్రమాన్ని నిర్వహించింది.
నిర్మాణ్ డెమో డే కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి.. అథితులు, ఫ్యాకల్టీ, విద్యార్థుల సమక్షంలో ప్రారంభించారు. ఏఐ, హెల్త్‌టెక్, డీప్‌టెక్, సస్టైనబిలిటీ వంటి వివిధ రంగాలలో ఆలోచన దశలో ఉన్న మొత్తం 30 స్టార్ట్-అప్‌లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ 'నిర్మాణ్ డెమో డే'ను వార్షిక కార్యక్రమంగా ఏటా నిర్వహించాలని ఐఐటీ మద్రాస్ భావిస్తోంది.
క్రియాశీల విద్యార్థుల నేతృత్వంలోని క్షేత్ర స్థాయిలో ఉన్న 85 స్టార్టప్‌లకు నిర్మాణ్ మద్దతు ఇస్తోంది. వీటిలో దాదాపు 26 స్టార్టప్‌లు ఇప్పటికే విజయవంతంగా మార్కెట్‌లోకి వచ్చి వెంచర్ ఫండింగ్‌లో రూ.108 కోట్లకు పైగా నిధులు సాధించాయి. వీటన్నింటి విలువ రూ.1,000 కోట్లకు పైగా చేరుకోవడం గమనార్హం. ఇలా నిర్మాణ్‌లో విజయవంతమైన స్టార్టప్‌లలో అర్బన్ మ్యాట్రిక్స్, మాడ్యులస్ హౌసింగ్, టాన్90, టోకల్, ఇన్ఫ్యూ ల్యాబ్స్, ఇన్వాల్వ్, మెల్వానో, సస్స్టెయిన్స్, జిమ్స్, ప్లీనోమ్ టెక్నాలజీస్, ప్రిస్క్రైబ్, గెలాక్సీ స్పేస్ ఉన్నాయి. గెలాక్సీ స్పేస్ ఇటీవల ఇన్ఫోసిస్ నుండి రూ. 17 కోట్ల నిధులు పొందగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment