
వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ముందు ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించారు. కానీ త్వరలో పూర్తికాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రాబోతుందనే వాదనలున్నాయి. దాంతో కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతుందో మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తున్నారు.
మోతీలాల్ ఓస్వాల్ అంచనా ప్రకారం..సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ సరళి చాలా భిన్నంగా ఉంది. ఎన్‌డీఏ కూటమికి గతంతో పోలిస్తే సీట్లు తగ్గాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల్లో గ్రామీణ ఓటర్లు పెద్దగా భాజపావైపు మొగ్గు చూపనట్లు తెలుస్తుంది. దాంతో ఈసారి పేద, మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రాయితీలు పెంచేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అంచనా. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో జాతీయ విధానాల కంటే రాష్ట్ర రాజకీయాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఇండియా కూటమి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఉచితాలతో కూడిన మేనిఫెస్టోను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్‌లో కొన్ని కీలక మార్పులుంటాయని తెలిసింది. ఉద్యోగుల పన్ను స్లాబ్‌లను పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీనిపై ప్రభుత్వం చర్చించనుంది.
ఇదీ చదవండి: ప్రత్యామ్నాయాలపై రియల్టీ ఇన్వెస్టర్ల దృష్టి
ఈ ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 288 స్థానాల్లో భాజపా, దాని విపక్షాలు పోటీ పడనున్నాయి. హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాలకు, జార్ఖండ్‌లోని 81 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.