2023 చివరకు 151 బిలియన్ డాలర్లు
జీడీపీలో 4.25 శాతం
2014లో కేవలం 10 బిలియన్ డాలర్లు
దేశీయంగా బయోఎకానమీ గతకొన్నేళ్లలో భారీగా పురోగమించినట్లు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్(బైరాక్) తాజా నివేదిక పేర్కొంది. దీంతో 2023 చివరికల్లా దేశీ బయోఎకానమీ విలువ 151 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 12,66,900 కోట్లు)కు చేరుకున్నట్లు తెలియజేసింది.
జాతీయ పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషించినట్లు ప్రస్తావిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ)లో4.25 శాతం వాటా సమకూర్చుతున్నట్లు వివరించింది. దీంతో ప్రపంచంలోని టాప్–5 బయోఎకానమీలలో భారత్ ఒకటిగా అవతరించినట్లు నివేదిక పేర్కొంది. బయోటెక్నాలజీ ఆధారిత ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(ఏబీఎల్‌ఈ) సహకారంతో బైరాక్(బీఐఆర్‌ఏసీ) రూపొందించిన నివేదికను గ్లోబల్ బయోఇండియా 2024 సదస్సు( 4వ ఎడిషన్)లో విడుదల చేసింది. నివేదిక వివరాలు చూద్దాం..
వృద్ధికి దన్నుఇలా
బయోఎకానమీ వృద్ధికి బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇన్నొవేషన్, హెల్త్‌కేర్, బయోమ్యాన్యుఫాక్చరింగ్ తదితరాలలో ఆధునిక పరివర్తన వంటి అంశాలు తోడ్పాటునిచ్చాయి. ఈ నేపథ్యంలో 2014కల్లా 10 బిలియన్ డాలర్ల విలువను నమోదు చేసిన దేశీ బయోఎకానమీ 2023 చివరికల్లా 151 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఈ పురోగతి జాతీయాభివృద్ధిలో కీలకపాత్రను పోషించింది. దేశ జీడీపీలో 4.25 శాతం వాటాను సమకూరుస్తోంది.
గ్లోబల్ బయోఎకానమీల టాప్–5 జాబితాలో భారత్‌కు చోటు కల్పించింది. బయోఈ3(ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఉద్యోగితలకు బయోటెక్నాలజీ) పాలసీ ప్రధానంగా ఇందుకు తోడ్పాటునిచి్చంది. బయో ఆధారిత రసాయనాలు, ప్రెసిషన్ బయోథెరప్యూటిక్స్, వాతావరణానుకూల వ్యవసాయం, సముద్రం, అంతరిక్ష సాంకేతికతలలో ఆధునిక పరిశోధనలపై ప్రధానంగా పాలసీ దృష్టిపెట్టింది.
వ్యాక్సిన్లు, బయోఫార్మాస్యూటికల్స్‌కు పెరుగుతున్న డిమాండ్ దేశీ బయోఎకానమీ వృద్ధిని ప్రతిబింబిస్తున్నట్లు డీబీటీ సెక్రటరీ, బైరాక్ చైర్మన్, డీజీ–బ్రిక్ రాజేష్ ఎస్.గోఖలే పేర్కొన్నారు. కొత్త బయోఈ3 పాలసీ ద్వారా ఈ పరిస్థితులకు మరింత ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. వెరసి 2030కల్లా దేశీ బయోఎకానమీ విలువ 300 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. బయోమ్యాన్యుఫాక్చరింగ్‌లో ఏఐ వినియోగాన్ని బలపరచడంతోపాటు.. బయో ఏఐ కేంద్రాల ఏర్పాటుకు తెరతీయవలసి ఉన్నట్లు తాజా నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం..
ఉపాధి అవకాశాలు
ఏఐ వినియోగం, ఆధునిక తయారీ తదితరాల ద్వారా బయోఎకానమీని మరింత పరుగు పెట్టించడంతో ఉద్యోగ అవకాశాలు ఊపందుకుంటాయి. వివిధ పరిశ్రమలలలో బయోటెక్నాలజీని మిళితం చేయడం ద్వారా ప్రధానంగా టైర్–2, టైర్–3 నగరాలలో ఉపాధికి ఊతం లభిస్తుంది. బయోఇండ్రస్టియల్ రంగం దేశీ బయోఎకానమీలో అతిపెద్ద పాత్ర పోషిస్తోంది. మొత్తం మార్కెట్ విలువలో 48 శాతం అంటే దాదాపు 73 బిలియన్ డాలర్ల విలువను ఆక్రమిస్తోంది.
బయోఇంధనాలు, బయోప్లాస్టిక్స్‌సహా.. టెక్స్‌టైల్స్, డిటర్జెంట్స్ పరిశ్రమలలో వినియోగించే ఎంజైమాటిక్ అప్లికేషన్లు ఈ విభాగంలోకి చేరతాయి. వీటిలో బయోఇంధనాలు భారీ వృద్ధిని సాధిస్తున్నాయి. 2023కల్లా ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 13.8 బిలియన్ లీటర్లకు చేరింది. దీంతో భారత్ ప్రపంచంలోనే ఇథనాల్ తయారీకి మూడో పెద్ద దేశంగా ఆవిర్భవించింది. ఇక బయోఫార్మా రంగం సైతం బయోఎకానమీలో 36 శాతం వాటాను ఆక్రమిస్తోంది. విలువ దాదాపు 54 బిలియన్ డాలర్లుకాగా.. దేశీయంగా వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యం ప్రపంచంలోనే నాయకత్వస్థాయిలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment