భారత్‌ ఎకానమీ వృద్ధి 18.5 శాతం! | India GDP Likely To Grow At 18.5 Percent In April June Quarter | Sakshi
Sakshi News home page

భారత్‌ ఎకానమీ వృద్ధి 18.5 శాతం!

Published Wed, Aug 25 2021 7:55 AM | Last Updated on Wed, Aug 25 2021 8:04 AM

India GDP Likely To Grow At 18.5 Percent In April June Quarter - Sakshi

ముంబై: భారత్‌ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో 18.5 శాతం వృద్ధి సాధిస్తుందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ రిపోర్ట్‌– ఎకోరాప్‌ అంచనావేసింది. అయితే దీనికి ప్రధాన కారణం బేస్‌ ఎఫెక్ట్‌ అని (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) కూడా నివేదిక పేర్కొనడం గమనార్హం. ఈ నెలాఖరున మొదటి త్రైమాసికం జీడీపీ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎకోరాప్‌ తన తాజా అంచనాలను తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 

పరిశ్రమలు, సేవల రంగాల క్రియాశీలత, అంత ర్జాతీయ ఆర్థిక పరిస్థితులుసహా 41 కీలక రంగా లు ప్రాతిపదికగా రూపొందించిన ‘నౌకాస్టింగ్‌ నమూనా’ ప్రాతిపదికన ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్‌ భారత్‌ ఎకానమీ తాజా అంచనాలను వెలువరించింది.  

తుది ప్రొడక్ట్‌తో సంబంధం లేకుండా ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ) ప్రకారం వృద్ధి రేటు క్యూ1లో 15 శాతంగా ఉంటుంది.  

మొదటి త్రైమాసికంలో కార్పొరేట్‌ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. స్థూల ఆదాయాల్లో మంచి రికవరీ కనిపించింది.  

4,069 కంపెనీలను చూస్తే, క్యూ1లో జీవీఏ వృద్ధి 28.4 శాతంగా ఉంది. అయితే 2020–21 చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) కన్నా ఈ వృద్ధి రేటు తక్కువ.  

కరోనా సెకండ్‌వేవ్‌తో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ జూన్‌లో పుంజుకుంది.  

బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ఆగస్టు 16తో ముగిసిన వారంలో 103.3 వద్ద ఉంది.  

ప్రాంతీయ రవాణా కార్యాలయాల ఆదాయాలు, విద్యుత్‌ వినియోగం, రవాణా ఇండికేటర్లు రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) మరింత మెరుగుపడే అవకాశం ఉంది.  

కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది.  నిజానికి దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రవేశపెట్టిన తర్వాత జీడీపీలో కుటుంబ రుణ భారాలు పెరుగుతూ వస్తుండడం గమనార్హం. 2017– 18లో ఇది 30.1 శాతంగా ఉంది. తరువాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 31.7 శాతం, 32.5 శాతంగా నమోదయ్యాయి. అంటే నాలుగేళ్లలో పెరిగిన రుణ భారం 7.2 శాతం.  

2020 లాక్‌డౌన్‌ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీ గా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్‌డౌన్‌ అమలు జరిగిన సంగతి తెలిసిందే. 
 
2021–22 మొదటి త్రైమాసికంపై ఆర్‌బీఐ అంచనా 21.4 శాతంకాగా, ఇక్రా అంచనా 20 శాతంగా ఉంది.

చదవండి : ఎలక్ట్రిక్‌ వాహనాలకు మద్దతుగా నిలవాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement