
ముంబై: ‘‘ద్రవ్య స్థిరీకరణ ఆలస్యమైనా ఫర్వాలేదు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు, వినియోగ డిమాండ్‌కు మద్దతుగా ఆదాయపన్ను, ఇంధన పన్ను భారం తగ్గించడంపై దృష్టి సారించాలి’’ అని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ సూచించింది. ‘ప్రీ బడ్జెట్ డిమాండ్స్’ పేరుతో ఈ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఫిబ్రవరి 1న 2022–23 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. కొత్తవి కాకుండా, గత బడ్జెట్‌లో ప్రకటించిన వాటి స్థిరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించొచ్చని అంచనా వేసింది. డిమాండ్ పెంచేందుకు, కరోనాతో ఎక్కువ ప్రభావితమైన రంగాల్లో ఉపాధి కల్పన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ద్రవ్యలోటు స్థిరీకరణ విషయంలో నిదానంగా వ్యవహరించాలని.. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు కావాల్సినంత వ ుద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది.
ఇతర సూచనలు
- వ్యక్తుల ఆర్థిక పరిస్థితులపై కరోనా ప్రతికూల ప్రభావం చూపించింది. కనుక ఆదాయపన్ను ఉపశమనాలు, ఇంధనాలపై పన్నుల తగ్గింపు రూపంలో మద్దతుగా నిలవాలి.
- అధిక ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికీ కారణమవుతున్నాయి.
- ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల మేర వ్యయాలను పెంచినా కానీ, ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్ష డిమాండ్ ఎందుకు పెరగలేదన్నది ఆర్థిక శాఖ విశ్లేషించుకోవాలి. అవసరమైన రంగాలకు ప్రభుత్వ మద్దతు ఇప్పటికీ అవసరం ఉందని ఇది తెలియజేస్తోంది.
- 2022–23లో రెవెన్యూ వ్యయం.. 2021–22కు సవరించిన అంచనాలకంటే ఎక్కువే ఉండొచ్చు.
- పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు మరింత ఆచరణాత్మకంగా ఉండాలి.
- జీసెక్ ఈల్డ్స్‌ను కట్టడి చేయాలి. బడ్జెట్‌లో పేర్కొన్నదాని కంటే ప్రభుత్వం రుణ సమీకరణ ఎక్కువే ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది.