న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 34 శాతం ఎగసి రూ. 690 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 514 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 11,482 కోట్లయ్యింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 9.04 శాతం నుంచి 9.13 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 2.35 శాతం నుంచి 2.72 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం స్వల్పంగా 2 శాతం బలపడి రూ. 4,395 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 36 శాతం జంప్‌చేసి రూ. 1,556 కోట్లయ్యింది.
ప్రొవిజన్లు అప్
తాజా సమీక్షా కాలంలో మొత్తం ప్రొవిజన్లు 11 శాతం అధికమై రూ. 2,598 కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ తెలియజేసింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 15.47 శాతంగా నమోదైంది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 0.1 శాతం నీరసించి 3.03 శాతానికి చేరాయి. రూ. 2,732 కోట్లమేర తాజా స్లిప్పేజీలు నమోదయ్యాయి. రూ. 5,400 కోట్ల విలువైన 34 మొండి ఖాతాలను గుర్తించినట్లు బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిలో తొలి దశకింద జాతీయ ఆస్తుల పునర్‌నిర్మాణ కంపెనీ(ఎన్‌ఏఆర్‌సీఎల్)కు రూ. 1,200 కోట్ల విలువగల 5 ఖాతాలను బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 6 శాతం పతనమై రూ. 159 వద్ద ముగిసింది.
ఇండియన్ బ్యాంక్ ప్లస్... క్యూ3లో రూ. 690 కోట్లు
Published Tue, Feb 8 2022 6:32 AM | Last Updated on Tue, Feb 8 2022 6:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment