ఇది అర్థం చేసుకుంటే వృద్ధి అవకాశాలు
ఎఫ్‌ఎంసీజీపై డెలాయిట్ నివేదిక
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని, తాము కొనుగోలు చేసే ఉత్పత్తుల విషయంలో విలువకు ప్రాధాన్యమిస్తున్నారని డెలాయిట్ నివేదిక తెలిపింది. కన్జ్యూమర్ వ్యాపారాలన్నింటా ఇదే ధోరణి కనిపిస్తున్నట్టు వివరించింది. ఖాళీ సమయాల్లో కార్యకలాపాలపై వినియోగదారులు తమ వ్యయాలను పెంచొచ్చని, దీంతో 2024–25లో ఏవియేషన్, హోటల్ పరిశ్రమలు మంచి పనితీరు నమోదు చేసే అవకాశాలున్నట్టు డెలాయిట్ నివేదిక అంచనా వేసింది.
సౌందర్య ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి క్షీణించొచ్చని అంచనా వేసింది. కరోనా అనంతరం కస్టమర్లు పెద్ద మొత్తంలో విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో 2024–25 సంవత్సరానికి అధిక బేస్ ఏర్పడినట్టు డెలాయిట్ ‘ఫ్యూచర్ ఆఫ్ రిటైల్’ నివేదిక వెల్లడించింది. ‘‘కొన్ని విభాగాల్లో ఆరంభస్థాయి ఉత్పత్తులతో పోల్చి చూస్తే ప్రీమియం ఉత్పత్తుల్లో వృద్ధి ఎక్కువగా ఉంది. ఎల్రక్టానిక్స్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో ఇది కనిపిస్తోంది.
ప్రీమియం ఉత్పత్తుల పరంగా తమ కస్టమర్ల ప్రాధాన్యతలను అర్థం చేసుకున్న కంపెనీలు దీన్నుంచి వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోగలవు’’ అని పేర్కొంది. చాలా విభాగాల్లో కస్టమర్లు పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి చోదకంగా నిలవగలదని తెలిపింది. ఈ ధోరణి నుంచి ప్రయోజనం పొందాలంటే కంపెనీలు తమను విశ్వసించే కస్టమర్లను కాపాడుకోవాలని, పనితీరు, విలువ పరంగా మెరుగైన ఉత్పత్తులతో వారికి చేరువ కావాలని సూచించింది. కస్టమర్లు, ఉత్పత్తులు, ఛానల్, అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిటైలర్లు 8–20 శాతం ఇంక్రిమెంటల్ వృద్ధిని సాధించొచ్చని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment