భారతదేశం ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తులు, వైద్య పరికరాల పరిశ్రమ విస్తరిస్తున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రంగంలో భారీగా దిగుమతి చేసుకుంటున్న యూఎస్, యూకే, ఇటలీలో భారత్ మార్కెట్ వాటా పెరుగుతోందని పేర్కొంది. యూఎస్‌కు ఔషధాలను అందించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని చెప్పింది. త్వరలో రెండో స్థానానికి చేరుతామని అంచనా వేసింది.
పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం..‘యూఎస్, యూకే, ఇటలీ దేశాలు దిగుమతి చేసుకునే ఇండియా ఫార్మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. యూఎస్‌కు ఔషధాలు ఎగుమతి చేసే దేశాల్లో ఐర్లాండ్, స్విట్జర్లాండ్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాలతో పోలిస్తే భారత్ 2023లో తన యూఎస్ మార్కెట్ వాటాను విస్తరించింది. త్వరలో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. 2022లో 7.33 బిలియన్ డాలర్లుగా(రూ.61 వేలకోట్లు) ఉన్న యూఎస్‌లోని భారత్ ఔషధ దిగుమతులు 2023లో 9.08 బిలియన్ డాలర్ల(రూ.76 వేలకోట్లు)కు పెరిగాయి. దాంతో ఇది 13.1%కు చేరింది. యూఎస్‌కు ఎగుమతిదారుగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్ వాటాలు వరుసగా 13.85%, 13.7%కు పడిపోయాయి.
ఇదీ చదవండి: ‘అనిశ్చితులున్నా కరెంట్ ఇస్తాం’
ఇటలీలోని యాంటీబయాటిక్స్ విభాగంలో భారత్ తన వాటాను పెంచుకుంది. అక్కడి మార్కెట్‌లో భారత్ పదో స్థానంలో ఉంది. అయితే 2022లో 0.96% ఉన్న ఇండియా వాటా 2023లో 2.12%కు పెరిగింది. విలువ పరంగా యాంటీబయాటిక్స్ ఎగుమతులు 2023లో 23.34 మిలియన్ డాలర్ల(రూ.195 కోట్లు)కు చేరాయి. జర్మనీకి ఎగుమతి చేసే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్‌ఐ) పరికరాల మార్కెట్ పెరిగింది. 2022లో దాని వాటా 0.45 శాతంగా ఉండేది. అది 2023లో 1.7%కు చేరింది. విలువ పరంగా ఈ ఎగుమతులు 2023లో 13.02 మిలియన్ డాలర్ల(రూ.109 కోట్లు)కు చేరుకున్నాయి. ఇదిలాఉండగా, భారత్ ఇలా ఫార్మా రంగంలో వృద్ధి చెందడానికి కేంద్ర అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment