కుంకుమ పువ్వు గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే కేజీ కుంకుమపువ్వు ధర రూ.4.95 లక్షల వరకు అమ్ముడవుతున్నట్లు సమాచారం. గత నెలలో మనదేశంలో కుంకుమపువ్వు ధరలు హోల్‌సేల్ మార్కెట్‌లో 20 శాతం, రిటైల్‌లో 27 శాతం పెరిగాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ నుంచి కుంకుమపువ్వు సరఫరా బాగా తగ్గుతోంది. ఈ కారణంగా మనదేశంలో కుంకుమపువ్వు భారీగా పెరిగింది.
భారతదేశంలో ఒక కేజీ కుంకుమ పువ్వు ధర.. సుమారు 70 గ్రాముల బంగారంతో సమానం. ఉత్తమ నాణ్యత గల భారతీయ కుంకుమపువ్వు ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లో రూ. 3.5 లక్షల నుంచి రూ. 3.6 లక్షలకు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో నుంచి సరఫరా అవుతున్న సమయంలో కేజీ కుంకుమ పువ్వు ధర రూ. 2.8 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య ఉండేది. ప్రస్తుతం ఈ ధర భారీగా పెరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద కుంకుమపువ్వు ఉత్పత్తిదారు ఇరాన్. ఈ దేశంలో కుంకుమ పువ్వు వార్షిక ఉత్పత్తి సుమారు 430 టన్నులు. ఇది ప్రపంచ కుంకుమపువ్వు ఉత్పత్తిలో దాదాపు 90% వాటాను కలిగి ఉంది. అయితే భారతదేశంలో కుంకుమ పువ్వు ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
'రెడ్ గోల్డ్'గా ప్రాచుర్యం పొందిన కాశ్మీర్‌లో కుంకుమపువ్వు సాగు 5,707 హెక్టార్ల భూమిలో పండిస్తారు. ఇందులో కూడా సుమారు 90 శాతానికంటే ఎక్కువ దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని పాంపోర్ తహసీల్‌లో పండిస్తారు. మిగిలింది సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్, శ్రీనగర్ జిల్లాల్లో పండిస్తారు.
కుంకుమ పువ్వు ఉత్పత్తి సంవత్సరానికి ఒకసారి మాత్రమే.. అక్టోబర్ చివరి నుంచి నవంబర్ మధ్య వరకు పండిస్తారు. ఒక కేజీ కుంకుమ పువ్వు పండించడానికి సుమారు 1,50,000 కంటే ఎక్కువ పువ్వులు కావాల్సి ఉంటుంది. వాతావరణంలో జరుగుతున్న కొన్ని మార్పుల వల్ల కుంకుమపువ్వు దిగుబడి బాగా తగ్గింది. దీంతో చాలామంది రైతులు కుంకుమ పువ్వు సాగును వదులుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment