స్టార్టప్స్‌లో పెట్టుబడుల దూకుడు | Indian startups raised 42 billion dollers in 2021 | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌లో పెట్టుబడుల దూకుడు

Published Sat, Jan 15 2022 6:24 AM | Last Updated on Sat, Jan 15 2022 6:24 AM

Indian startups raised 42 billion dollers in 2021 - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్‌ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్‌లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం విశేషం! దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. బిలియన్‌ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఫలితంగా దేశంలో యూనికార్న్‌ల సంఖ్య 90కు చేరింది. 2021 దేశీ టెక్‌ యూనికార్న్‌ నివేదిక పేరుతో ఓరిస్‌ వెంచర్‌ పార్టనర్స్‌ రూపొందించిన వివరాలివి. వీటి ప్రకారం..

టాప్‌–3 ర్యాంక్‌..
గతేడాది బిలియన్‌ డాలర్ల విలువను సాధించిన కంపెనీల జాబితాలో షేర్‌చాట్, క్రెడ్, మీషో, నజారా, మాగ్లిక్స్, ఎంపీఎల్, గ్రోఫర్స్‌(బ్లింకిట్‌), అప్‌గ్రాడ్, మమాఎర్త్, గ్లోబల్‌బీస్, అకో, స్పిన్నీ తదితరాలు చోటు సాధించాయి. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్‌ 90 యూనికార్న్‌లతో మూడో ర్యాంకులో నిలిచింది. వెరసి 39 యూనికార్న్‌లకు ఆవాసమైన యూకేను నాలుగో ర్యాంకులోకి నెట్టింది. 60,000 స్టార్టప్‌లకు నిలయంకావడం ద్వారా భారత్‌ మూడోపెద్ద స్టార్టప్‌ ఎకోవ్యవస్థగల దేశంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 13 యూనికార్న్‌లలో ఒకటి దేశీయంగానే ఊపిరి పోసుకుంటుండటం విశేషం!

ఉపాధి సైతం
భారీగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లు కొత్తతరహా సొల్యూషన్స్, సాంకేతికతలను అందించడమేకాకుండా భారీ స్థాయిలో ఉపాధి కల్పనకూ దారి చూపుతున్నాయి. దారి చూపుతున్నాయి. ఫిన్‌టెక్, ఈకామర్స్, ఎస్‌ఏఏఎస్‌(సాస్‌) విభాగాల నుంచి అత్యధికంగా స్టార్టప్‌లు ఆవిర్భవిస్తున్నాయి. వీటి తదుపరి హెల్త్‌టెక్, ఎడ్‌టెక్, డీ2సీ, గేమింగ్, క్రిప్టో విభాగాలు నిలుస్తున్నాయి. అత్యధిక స్టార్టప్‌లకు బెంగళూరు నెలవుకాగా.. విలువలో 37.6 బిలియన్‌ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ అగ్రపథాన్ని పొందింది.3.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సమీకరించడం ద్వారా గత జులైలో ఈ విలువను అందుకుంది. ఇక ఆరు నెలల్లోనే యూనికార్న్‌ హోదాను పొందిన సంస్థగామెన్సా బ్రాండ్స్‌ గుర్తింపు పొందింది. 2021 మే నెలలో 5 కోట్ల డాలర్లు సమకూర్చుకోవడంతో ఈ విలువను సాధించింది.  

డెకాకార్న్‌లు..
10 బిలియన్‌ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్‌లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో రూమ్స్‌ డెకాకార్న్‌లుగా ఆవిర్భవించాయి. గతేడాది అత్యధికంగా 11 స్టార్టప్‌లు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టాయి. వీటిలో 8 యూనికార్న్‌ సంస్థలుండటం గమనార్హం! ఐపీవోల ద్వారా 7.16 బిలియన్‌ డాలర్లను సమకూర్చుకున్నాయి. వన్‌97 కమ్యూనికేషన్స్‌(పేటీఎమ్‌) కొత్త రికార్డ్‌ నెలకొల్పుతూ రూ. 18,300 కోట్లు(2.46 బిలియన్‌ డాలర్లు) అందుకుంది. మరోపక్క జొమాటో 14.8 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)తో చరిత్ర సృష్టించింది. ఈ బాటలో నైకా 13.5 బిలియన్‌ డాలర్లు, ఫ్రెష్‌వర్క్స్‌ 6.9 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించడం విశేషం!   

మహిళలూ..
యూనికార్న్‌ల వ్యవస్థాపకుల్లో 20 శాతం నాన్‌ఇంజినీర్స్‌కాగా.. దాదాపు 67 శాతంవరకూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్‌బీ నుంచి ఒకరు లేదా అంతకుమించిన వ్యక్తులున్నారు. జాబితాలో 13 మంది మహిళా వ్యవస్థాపకులకు చోటు లభించగా.. 2021లోనే 8 మంది ఈ హోదాను సాధించారు. వీరిలో ఫాల్గుణి నాయర్‌(నైకా), గజల్‌ కల్రా(రివిగో), రుచీ కల్రా(ఆఫ్‌బిజినెస్‌), దివ్యా గోకుల్‌నాథ్‌(బైజూస్‌), ఘజల్‌ అలఘ్‌(మమాఎర్త్‌), సరితా కటికనేని(జెనోటీ) తదితరులున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement