
భారత్‌లో స్టార్టప్స్ జోరుమీదున్నాయి. ఈ కంపెనీల్లోకి నిధుల వరద కొనసాగుతోంది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో స్టార్టప్స్ జోరుమీదున్నాయి. ఈ కంపెనీల్లోకి నిధుల వరద కొనసాగుతోంది. స్టార్టప్స్ గతేడాది సుమారు రూ.74,020 కోట్ల నిధులను అందుకున్నట్టు అంచనా. 1,200లకుపైగా డీల్స్ కుదిరినట్టు కన్సల్టింగ్ కంపెనీ హెక్స్‌జెన్ చెబుతోంది. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలోనూ ఈ స్థాయి నిధులు సమీకరించడం గమనార్హం. పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపేందుకు, వ్యవస్థాపక సంస్కృతి పెంపొందించేందుకు ఇన్వెస్ట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అగ్ని తదితర ప్రభుత్వ సంస్థలు కారణమయ్యాయి. నిధులను స్వీకరించడంలో భారత్‌లో ఈ–కామర్స్, ఫిన్‌టెక్, ఎడ్యుటెక్ సంస్థలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్ పొందిన రూ.1.52 లక్షల కోట్ల నిధులు వీటికి అదనం అని హెక్స్‌జెన్ తెలిపింది.
నివేదిక ప్రకారం..
2019లో రూ.1,07,300 కోట్ల ఫండింగ్‌ను స్టార్టప్స్ చేజిక్కించుకున్నాయి. అయితే 2019తో పోలిస్తే 2020లో నమోదైన డీల్స్ 20 శాతం అధికం కావడం విశేషం. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కంపెనీల ప్రారంభ స్థాయిలో (సీడ్ స్టేజ్) జరిగిన పెట్టుబడి ఒప్పందాలు పెరిగాయి. ఇవి 2019లో రూ.2,610 కోట్ల విలువైన 420 డీల్స్ జరిగాయి. ఆ తర్వాతి ఏడాదిలో రూ.2,720 కోట్ల నిధులతో కూడిన 672 డీల్స్ నమోదయ్యాయి. తొలి దశ పెట్టుబడిదారులు ఇప్పుడు రిస్క్ తీసుకునేవారికి ప్రారంభంలో మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది స్టార్టప్స్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సంకేతం.
మూడేళ్లుగా నాల్గవ స్థానంలో..
2020లో అంతర్జాతీయంగా రూ.22.48 లక్షల కోట్ల నిధులు స్టార్టప్స్‌లోకి వెల్లువెత్తాయి. పెట్టుబడులను ఆకర్శించడంలో యూఎస్, చైనా, యూకే తర్వాత భారత్ నిలిచింది. మూడేళ్లుగా భారత్ ఇలా నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. దేశంలోని స్టార్టప్స్ అందుకున్న నిధుల్లో బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై వాటా ఏకంగా 90 శాతం ఉంది. బెంగళూరు రూ.31,390 కోట్లు, ఢిల్లీ ఎన్‌సీఆర్ రూ.21,900 కోట్లు, ముంబై స్టార్టప్స్ రూ.14,600 కోట్లు చేజిక్కించుకున్నాయి.
జోరుగా ఈ–కామర్స్‌లోకి..
ఫండింగ్ ఆకర్శించడంలో ఈ–కామర్స్ ముందు వరుసలో ఉంది. ఈ రంగం గతేడాది రూ.21,900 కోట్ల నిధులను అందుకుంది. ఫిన్‌టెక్ రూ.17,301 కోట్లు, ఎడ్యుటెక్ విభాగంలోని స్టార్టప్స్ రూ.11,096 కోట్లు స్వీకరించాయి. 2019తో పోలిస్తే గతేడాది ఎడ్యుటెక్ రంగ స్టార్టప్స్‌లోకి వచ్చిన నిధులు నాలుగు రెట్లు అధికం కావడం విశేషం. అత్యధికంగా జొమాటో రూ.7,450 కోట్లు, బైజూస్ రూ.6,730 కోట్లు, ఫోన్‌పే రూ.5,891 కోట్లు అందుకున్నాయి. అయితే రవాణా, సరుకు రవాణా, యాత్రలు, పర్యాటక రంగాల్లోకి వచ్చిన ఫండ్స్ 90 శాతం తగ్గాయి.