ఆటుపోట్లు ఉన్నా కానీ, దీర్ఘకాలంలో మంచి రాబడులు కావాలని కోరుకునే వారికి మిడ్‌క్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. మిడ్ క్యాప్ ఫండ్స్ విభాగంలో ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ పథకం అన్ని కాలాల్లోనూ నమ్మకమైన పనితీరుతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. అవ్వడానికి మిడ్‌క్యాప్ పథకమే అయినప్పటికీ.. గతేడాది మార్కెట్ భారీ కరెక్షన్‌లో ఈ పథకంలో నష్టాలు సూచీలతో పోలిస్తే తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్ ఫండ్స్ సగటున 10 శాతం నష్టాలను ఇవ్వగా, ఇన్వెస్కో ఇండియా కేవలం 3.8 శాతానికే నష్టాలను పరిమితం చేసింది. పేరుకు తగినట్టు ఈ పథకం మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెడుతుంది. మార్కెట్ క్యాప్ పరంగా 101 నుంచి 250వ స్థానం వరకు ఉన్న కంపెనీలు మిడ్‌క్యాప్ విభాగం కిందకు వస్తాయి. మార్కెట్ విలువ పరంగా టాప్ 100 కంపెనీలు లార్జ్‌క్యాప్ కిందకు వస్తాయి.
రాబడులు
ఈ పథకం రాబడులకు బెంచ్ మార్క్ సూచీ ‘బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 150టీఆర్‌ఐ’. ఇందులో టీఆర్‌ఐ అన్నది టోటల్ రిటర్న్ ఇండెక్స్‌ను సూచిస్తుంది. ట్రెయిలింగ్ ప్రాతిపదికన చూస్తే రాబడులు అన్ని కాలాల్లోనూ స్థిరంగా కనిపిస్తాయి. గడిచిన ఏడాది కాలంలో 42 శాతం వరకు రాబడిని అందించింది. మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 22 శాతానికిపైనే ఉన్నాయి. ఐదేళ్లలో 20 శాతం, ఏడేళ్లలో 15.47 శాతం, పదేళ్ల కాలంలో 21.66 శాతం చొప్పున వార్షిక రాబడిని పెట్టుబడిదారులకు అందించింది. 2007 ఏప్రిల్‌లో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 16 శాతంగా ఉండడం గమనార్హం.
పెట్టుబడుల విధానం
దీర్ఘకాలంలో చక్కని వృద్ధికి అవకాశాలున్న మిడ్‌క్యాప్ కంపెనీలను ఈ పథకం పరిశోధక బృందం జల్లెడ పట్టి అన్వేషిస్తుంది. రంగాల వారీగా పెట్టుబడుల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేయడాన్ని కూడా గమనించొచ్చు. 2013, 2014 సంవత్సరాల్లో మంచి పనితీరు చూపించగా, మధ్యలో కాస్త వెనుకబడింది. కానీ మళ్లీ పుంజుకుని తర్వాతి కాలాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. కనుక ఇన్వెస్టర్లు కనీసం ఐదేళ్లు, అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. అది కూడా ఏకమొత్తంలో (లంప్‌సమ్) కంటే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. దీనివల్ల రాబడులు సగటున మెరుగ్గా ఉంటాయి.
పోర్ట్‌ఫోలియో
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.2,059 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 96.3 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. మిగిలిన మేర నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 43 స్టాక్స్ ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 63 శాతం వరకు పెట్టుబడులు పెట్టగా.. 22 శాతం వరకు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు, 14 శాతం మేర స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. పెట్టుబడుల పరంగా ఇంజనీరింగ్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 16 శాతం కేటాయించింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు 14 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 13 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 10 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. దీర్ఘకాలికంగా చూస్తే చక్కటి ప్రయోజనాలు ఇచ్చే విధంగా పోర్ట్‌ఫోలియో రూపకల్పన జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment