న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఆక్టోబర్‌లో కాస్తంత నిదానించింది. నికరంగా రూ. 5,215 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ ఫండ్స్ ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.8,677 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్లు గరిష్టాల వద్ద కదలాడుతుండడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే నికర పెట్టుబడుల్లో క్షీణతకు కారణమని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్, అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ‘‘అధిక విలువలను చూసి చాలా మంది ఇన్వెస్టర్లు తటస్థంగా ఉండియారు. ఇందుకు నిదర్శనమే.. సెప్టెంబర్‌లో రూ.3 6,656 కోట్లను సమీకరించగా.. అక్టోబర్‌లో ఇది రూ. 28,671 కోట్లకు తగ్గడం’’ అని శ్రీవాస్తవ వివరించారు. ‘‘ఈక్విటీల్లో పెట్టుబడుల వాతావరణం కొనసాగింది. కానీ, అదే సమయంలో లాభాల స్వీకరణ కూడా కనిపించింది. మొత్తం మీద రూ. 23,500 కోట్ల మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈక్విటీ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ ఎనిమిది నెలల్లో రూ. 73,766 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి.
విభాగాల వారీగా..
- మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు (ఆస్తులు/ఏయూఎం) అక్టోబర్ చివరికి రూ.38.21లక్షల కోట్లకు పెరి గాయి. సెప్టెంబర్ చివరికి ఈ మొత్తం రూ. 37.41 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.
- వ్యాల్యూ, ఈఎల్‌ఎస్‌ఎస్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విభాగాలు నికరంగా పెట్టుబడులను ఆకర్షించాయి. సెక్టోరల్/థీమ్యాటిక్, ఫ్లెక్సీక్యాప్, లార్జ్‌క్యాప్, ఫోకస్డ్, లార్జ్‌అండ్‌మిడ్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు.
- బ్రిడ్ విభాగంలోని పథకాల్లోకి నికరంగా రూ.10,437 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో ఈ మొత్తం రూ.3,587 కోట్లుగానే ఉంది.
- డైనమిక్ అస్సెట్ అలోకేషన్/బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ విభాగం సైతం రూ.11,219 కోట్లను ఆకర్షించింది. వ్యాల్యూషన్ల ఆధారంగా డెట్, ఈక్విటీ మధ్య పెట్టుబడులను ఈ విభాగంలోని పథకాలు మారుస్తుంటాయి.
- ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల్లోకి రూ.10,759 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- నెలవారీగా వచ్చే సిప్ పెట్టుబడులు అక్టోబర్‌లో 10,518 కోట్లకు పెరిగాయి. ఇది రికార్డు గరిష్ట స్థాయి. సెప్టెంబర్‌లో ఈ మొత్తం రూ.10,351 కోట్లుగా ఉంది.
- డెట్ ఫండ్స్ నికరంగా రూ.12,984 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో డెట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.63,910 కోట్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం.
- మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి (డెట్, ఈక్విటీ తదితర) అక్టోబర్‌లో రూ.38,275 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో వచ్చిన రూ.47,257 కోట్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment