దేశీయ మార్కెట్లు కేవలం రెండు రోజుల్లోనే 1200 పాయింట్లకు పైగా పడిపోయింది. గత కొద్ది రోజులుగా జోరు మీద ఉన్న బుల్ నిన్నటి నుంచి భారీ నష్టాల్లో కొనసాగుతుంది. నేడు, సెన్సెక్స్ 656.04 పాయింట్లు (1.08%) క్షీణించి 60,098.82 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 174.60 పాయింట్లు(0.96%) క్షీణించి 17,938.40 వద్ద ముగిసింది. రెండు రోజుల్లో భారీగా మార్కెట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.5.15 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
దీంతో, బిఎస్ఈ స్టాక్స్ మొత్తం మార్కెట్ విలువ రూ.2,80,02,438 కోట్ల నుంచి రూ.2,74,85,912 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలే ప్రధాన కారణం. అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలు అలుముకోవడంతో విదేశీ సంస్థాగత మదుపర్లతో పాటు దేశీయ సంస్థాగత మదుపర్లు కూడా అమ్మకాలకు దిగడం సూచీలపై ప్రభావం చూపింది. యుఏఈ చమురు ట్యాంకర్లపై దాడుల తర్వాత చమురు ధరలు ఏడు సంవత్సరాల గరిష్టానికి పెరిగాయి. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ప్రపంచ వ్యాప్తంగా చమురు వినియోగం తగ్గిపోయింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలను మరోసారి ఆయిల్ కంపెనీలు పెంచాయి.
క్రూడ్ ఆయిల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుని 87 డాలర్ల దగ్గర నమోదు అవుతోంది. దీంతో మార్కెట్‌లో ఆందోళన నెలకొంది. ఇంకా, అమెరికాలో 5జీ సేవల ప్రారంభంపై విమానయాన సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేయడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇప్పటికే అనేక దేశాలు విమానాలను రీషెడ్యూల్ చేశాయి. మరోవైపు అంతర్జాతీయ విమాన సేవలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు కొనసాగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రతికూల పరిణామాలే నేడు దేశీయ సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
(చదవండి: దరిద్రపుగొట్టు ఇల్లు.. ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది!)
Comments
Please login to add a commentAdd a comment