ముంబై: కీలక వడ్డీరేట్ల పెంపు మార్చిలో ఉంటుందనే అమెరికా ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో గురువారం ఈక్విటీ మార్కెట్లు బేర్‌మన్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం దేశీయ మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు నెలకొని ఎనిమిదేళ్ల తర్వాత బ్యారెల్ క్రూడాయిల్ ధర 90 డాలర్లను తాకింది. డాలర్ విలువ ఐదు వారాల గరిష్టానికి చేరింది.
ఈ అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,277 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168 పాయింట్లను కోల్పోయి 17,110 వద్ద నిలిచింది. ఐటీ, ఫార్మా షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. ద్వితీయార్థంలో బ్యాంకింగ్ షేర్లు భారీగా రాణించాయి. ఆటో, మీడియా షేర్లలో చెప్పుకోదగిన కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ సూచీలో తొమ్మిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,267 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ.2,881 కోట్ల షేర్లను కొన్నారు. సూచీలు ఒకశాతం నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒకరోజులో రూ.2.81 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. తద్వారా బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.2,59 లక్షల కోట్లకు దిగివచ్చింది.
నష్టాలను పరిమితం చేసిన బ్యాంకింగ్
సూచీలు భారీ నష్టంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 541 పాయింట్ల నష్టంతో 57,317 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు పతనమై 17,062 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1419 పాయింట్లు కోల్పోయి 56,439 వద్ద, నిఫ్టీ 411 పాయింట్లు నష్టపోయి 16,867 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్ సెషన్ నుంచి బ్యాంకింగ్ షేర్లకు అనూహ్య కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ నష్టాలు (–)1,419 పాయింట్ల నుంచి (–)581కు, నిఫ్టీ (–) నష్టాలు 411 పాయింట్ల నుంచి (–)167 పరిమితయ్యాయి. కాగా డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు బలహీనపడి 75.09 వద్ద ముగిసింది.
ఐపీవో బాటలో బోట్
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment