హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతేడాది కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానం క్రమంగా రెండో దశకు చేరుకుంది. ఇంటి నుంచి పని విధానం కాస్త హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు తెరలేపింది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఉద్యోగులు గతంలో మాదిరిగా రోజూ ఆఫీసులకు వచ్చే సూచనలు కనిపించకపోవటంతో హైబ్రిడ్ వర్కింగ్ విధానాలపై కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఒక రోజు ఇంటి నుంచి.. మరొక రోజు ఆఫీసు నుంచి పని చేసే వీలుండటమే హైబ్రిడ్ ప్రత్యేకత. ఉత్పాదకత పెరగడంతో పాటు ఉద్యోగుల గైర్హాజరు సగానికి పైగా తగ్గడంతో కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
దేశంలో కరోనా కేసులు కాసింత తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో కార్యాలయాల పునఃప్రారంభం, ఉద్యోగులు హాజరు అంశాల మీద చాలా వరకు కంపెనీలు కన్సల్టెంట్లతో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పెద్ద కంపెనీలు హైబ్రిడ్ పని విధానంతో ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఈ విధానాన్ని ప్రారంభించేశాయని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ యూనిలివర్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ లీనా నాయర్ తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ప్రారంభమైన వర్క్ ఫ్రం హోమ్ విధానం ఇక ఎప్పటికీ పోదని చెప్పారు. కరోనాతో అనివార్యమైన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కంపెనీలు, ఉద్యోగులు స్వాగతించక తప్పదన్నారు. 40 గంటల వారాల పాటు పనిదినాల తిరిగి రావటం ఇప్పట్లో కష్టమే. వ్యాపార సంస్థలకు ఉత్తమమైన పని విధానాలకు మారేందుకు కరోనా రూపంలో ఒక మంచి అవకాశం వచ్చిందని తెలిపారు. ఇప్పటికే యూనిలివర్ సరళమైన పని విధానాలను కలిగి ఉందని చెప్పారు. దీన్ని మరింత సమర్ధవంతగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మరింత మెరుగైన పని విధానాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నామని తెలిపారు. 2020కి ముందటి పని విధానాలైతే తిరిగి రావని తేల్చిచెప్పారు.
హైబ్రిడ్ వర్క్‌తో ఉత్పాదకత మెరుగు..
గతేడాది పని విధానాలలోని సవాళ్లను, మార్పులను గమనించిన కంపెనీలు పని విధానాలలో సరికొత్త మార్పులు చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్, ఆఫీస్ ఫ్రం వర్క్ రెండు రకాల పని విధానాలతో భవిష్యత్తు కార్యాలయాలుంటాయి. ఇటీవలే పెప్సికో కార్పొరేట్ అసోసియేట్స్ కోసం ‘వర్క్ దట్ వర్క్స్’ కొత్త ప్రోగ్రామ్ కింద ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ప్లేస్ పాలసీలను మార్పు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త విధానంతో ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మేనేజర్స్, అసోసియేట్స్ రిమోట్ వర్క్ లేదా వర్క్ ఫ్రం హోమ్‌లో ఏ పని చేయాలో.. అదే సమయంలో కార్యాలయంలో ఏ పని చేయాలో ఎంపిక చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఇలాంటి సౌకర్యవంతమైన పని విధానంలో ఉద్యోగుల గైర్హాజరు 31 శాతం తక్కువగా ఉంటుందని పెప్సికో అధ్యయనం తెలిపింది. అదే సమయంలో ఉత్పాకదతలో 15 శాతం వృద్ధి, టర్నోవర్‌లో 10 శాతం క్షీణత, వేధింపులు 10 శాతం తగ్గాయని పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి కేపీఎంజీ ఇండియా హైబ్రిడ్ ఆఫీస్ పని విధానాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తుంది.
ఉద్యోగుల దృష్టి కోణంలోంచి..
వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత మీద ప్రభావితం చూపుతుందన్న సందేహాలు చాలా వ్యాపార సంస్థలకున్నాయి. అయితే ఈ సందేహాలన్నీ కరోనాతో పటాపంచలయ్యాయని పెప్సికో ఇండియా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ పవిత్రా సింగ్ చెప్పారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులలో ఇలాంటి విధానం కీలకమైనదని.. ఇదొక గొప్ప ముందడుగని తెలిపారు. సాధారణ పని విధానాల మైండ్‌సెట్ మారాల్సిన అవసరం ఉందని సూచించారు. అప్పుడే హైబ్రిడ్ పని విధానాల ప్రయోజనాలను మరింత సహజంగా నమ్ముతారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు హైబ్రిడ్ పని విధానాలను కచ్చితంగా ఇష్టపడతారని.. అయితే అదే సమయంలో ఆఫీస్, సహోద్యోగులతో అనుబంధాలను కోల్పోతారని తెలిపారు. వారంలో కొన్ని రోజులు మాత్రమే ఆఫీసులకు రావటానికి ఇష్టపడతారు. ఎందుకంటే సాధారణ పని విధానం, ఒత్తిళ్లకు విరామం, సహోద్యోగులు, స్నేహితులతో కలిసే అవకాశం దొరుకుతుందని. అయితే హైబ్రిడ్ పని విధానాన్ని ఉద్యోగుల దృష్టి కోణంలోంచి చూస్తే.. ఔట్‌పుట్ డెలివరీ, వాస్తవ ఉత్పాదకత పెరిగాయి. ఉద్యోగుల సృజనాత్మకత ఆలోచనలు, ఆవిష్కరణలు, ఆనందాల విషయంలో వ్యాపార సంస్థలు, యజమానులు రాజీపడకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఇక్కడే హైబ్రిడ్ పని విధానం సమర్ధవంతమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ వర్కింగ్ మోడల్‌లో ఆవిష్కరణ, çసహకరణ, అనుసంధానం, ఆనందం అన్ని రకాల అంశాలుంటాయని వివరించారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే..
వర్క్ ఫ్రం హోమ్ విధానంలోనే ఉద్యోగులు స్థిరపడిపోతే వాళ్లు కార్యాలయ వాతావరణాన్ని, సహోద్యోగులతో అనుబంధాలను కోల్పోతారు. అందుకే ఉద్యోగులు తరుచుగా ఆఫీస్‌కు రావాల్సిన అవసరం ఉందని నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ హెడ్ విక్రమ్ ష్రాఫ్ తెలిపారు. హైబ్రిడ్ పని విధానంలో ప్రత్యామ్నాయ పని దినాలు, ఫ్లెక్సిబుల్ పని గంటల వంటి ఫీచర్లుంటాయి. ఫ్రంట్ డెస్క్, ప్రధాన ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులతో దశల వారీగా ఆఫీసు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే అవకాశాలపై దృష్టిసారించాయి. టీకా వేయించుకున్న ఉద్యోగులే ఆఫీసులకు రావటానికి మొగ్గుచూపుతారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగుల అవసరాలను, ఆవశ్యకతలను దృష్టిలో పెట్టుకొని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించాలని ష్రాఫ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment