
రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 14 పాయింట్లు బలపడి 38,854 వద్ద నిలవగా.. నిఫ్టీ 15 పాయింట్లు పుంజుకుని 11,464 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,978-38,712 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 11,493-11,420 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో గురువారం యూఎస్ మార్కెట్లు మళ్లీ పతనంకావడంతో దేశీ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. తదుపరి స్వల్ప స్థాయిలో ఆటుపోట్లను చవిచూశాయి.
మీడియా వీక్
ఎన్‌ఎస్‌ఈలో మీడియా 0.9 శాతం బలహీనపడగా.. ప్రయివేట్ బ్యాంక్స్ 0.15 శాతం నీరసించాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఎఫ్‌ఎంసీజీ 1.3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, టీసీఎస్, హీరో మోటో, యూపీఎల్, బ్రిటానియా, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాటెల్, కొటక్ బ్యాంక్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ, ఇండస్‌ఇండ్, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐషర్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్, సన్ ఫార్మా 2.2-0.8 శాతం మధ్య నష్టపోయాయి.
కోఫోర్జ్ జూమ్
డెరివేటివ్ కౌంటర్లలో కోఫోర్జ్ 9 శాతం దూసుకెళ్లగా.. మణప్పురం, కంకార్, ఐజీఎల్, బాలకృష్ణ, జిందాల్ స్టీల్, ముత్తూట్, గ్లెన్‌మార్క్, డీఎల్‌ఎఫ్, జూబిలెంట్ ఫుడ్, ఇండిగో 7-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క కమిన్స్, పీవీఆర్, ఐడియా, ఏసీసీ, ఐసీఐసీఐ ప్రు, హెచ్‌పీసీఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3.5-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1406 లాభపడగా., 1277 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 838 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 317 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 959 కోట్లు, డీఐఐలు రూ. 264 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 620 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.