
సాక్షి, హైదరాబాద్ ,బిజినెస్ బ్యూరో: మీడియా, వినోద రంగం దేశంలో ఈ ఏడాది వృద్ధిని నమోదు చేస్తుందని ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్త నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2019తో పోలిస్తే పరిశ్రమ గతేడాది మహమ్మారి కారణంగా 24 శాతం తగ్గి రూ.1.38 లక్షల కోట్లు నమోదు చేసింది. 2017 స్థాయికి చేరింది. 2020 చివరి త్రైమాసికంలో చాలా విభాగాల్లో ఆదాయాల్లో రికవరీ నమోదైంది. 2021లో మీడియా, వినోద రంగం 25 శాతం వృద్ధి చెంది రూ.1.73 లక్షల కోట్లను తాకుతుంది. ఏటా సగటున 13.7 శాతం అధికమై 2023 నాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరుతుంది. 2025 నాటికి మీడియా, వినోద రంగం ఆదాయం రూ.2.68 లక్షల కోట్లకు చేరనుంది.
జోరుగా ఓటీటీ..
పరిశ్రమలో టెలివిజన్ విభాగం అగ్రస్థానంలో కొనసాగుతోంది. గతేడాది 2.8 కోట్ల మంది కస్టమర్లు 5.3 కోట్ల ఓటీటీ చందాలను కట్టారు. దీంతో డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ ఆదాయాలు 49 శాతం పెరిగాయి. 2019లో 1.05 కోట్ల కస్టమర్లు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు చేశారు. ప్రధానంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మూలంగా గతేడాది వృద్ధికి తోడైంది. ఐపీఎల్ ప్రసార హక్కులు స్టార్ గ్రూప్‌నకు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కంటెంట్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో పెట్టుబడులు పెద్ద ఎత్తున చేశాయి. ప్రాంతీయ భాషల్లో ఉత్పత్తులను తీసుకొచ్చాయి. డేటా ప్లాన్స్‌తో బండిల్‌గా రావడంతో 28.4 కోట్ల మంది కస్టమర్లు కంటెంట్‌ను ఆస్వాదించారు.
ఆన్‌లైన్ గేమింగ్ ఇలా..
2019లో మీడియా, వినోద రంగంలో 16 శాతం వాటా ఉన్న డిజిటల్, ఆన్‌లైన్ గేమింగ్ 2020లో 23 శాతానికి ఎగసింది. నాలుగేళ్లుగా ఆన్‌లైన్ గేమింగ్ విభాగం వేగంగా వృద్ధి సాధిస్తోంది. 2020లో ఈ విభాగం రూ.7,600 కోట్ల ఆదాయం నమోదు చేసింది. అంత క్రితం ఏడాది ఇది రూ.6,500 కోట్లుగా ఉంది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం, ఆన్‌లైన్ తరగతులతో ఆన్‌లైన్ గేమింగ్ 18 శాతం వృద్ది సాధించింది. ఆన్‌లైన్ గేమర్స్ 20 శాతం అధికమై 36 కోట్లకు చేరారు. పలు రాష్ట్రాల్లో నియంత్రణలు ఉన్నప్పటికీ లావాదేవీల ఆధారిత గేమ్స్ ఆదాయం 21 శాతం అధికమైంది. సాధారణ గేమ్స్ ఆదాయం 7 శాతం పెరిగింది.
థియేటర్ల ద్వారా ఆదాయం..
సినిమా, వీడియో ఆన్ డిమాండ్ 2019లో రూ.11,900 కోట్లు నమోదైంది. గతేడాది ఇది భారీగా తగ్గి రూ.7,200 కోట్లకు పరిమితమైంది. 2020లో థియేటర్ల ద్వారా ఆదాయం 2019తో పోలిస్తే పావు వంతులోపుకు పడిపోయింది. అయితే డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం పెరగడం కాస్త ఊరటనిచ్చింది. డిజిటల్ రైట్స్ ఆదాయం దాదాపు రెండింతలై రూ.3,500 కోట్లు నమోదైంది. సినిమా నిర్మాణాలు ఆరు నెలలకుపైగా నిలిచిపోవడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. టీవీ, సినిమా, సంగీతం రికవరీకి ఒకట్రెండేళ్లు పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment