మెటల్‌ దిగ్గజంగా టాటా స్టీల్‌ | Mega Merger: 7 metal companies of Tata Group to be merged with Tata Steel | Sakshi
Sakshi News home page

మెటల్‌ దిగ్గజంగా టాటా స్టీల్‌

Published Sat, Sep 24 2022 6:18 AM | Last Updated on Sat, Sep 24 2022 6:18 AM

Mega Merger: 7 metal companies of Tata Group to be merged with Tata Steel - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం టాటా స్టీల్‌ భారీ విలీనానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్‌లోని 7 మెటల్‌ అనుబంధ కంపెనీలను విలీనం చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. ఇందుకు వీలుగా గతంలో ప్రతిపాదించిన టాటా మెటాలిక్స్, టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రొడక్ట్స్‌ విలీనాన్ని విరమించుకుంది. వెరసి తాజాగా ఈ రెండు సంస్థలతోపాటు.. టిన్‌ప్లేట్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా, టీఆర్‌ఎఫ్‌ లిమిటెడ్, ఇండియన్‌ స్టీల్‌ – వైర్‌ ప్రొడక్ట్స్, టాటా స్టీల్‌ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ను విలీనం చేసుకోనున్నట్లు టాటా స్టీల్‌ పేర్కొంది. ఈ విలీనంతో సామర్థ్యాల పెంపు, వ్యయాల తగ్గింపునకు బాటలు వేసుకోనుంది. ఇందుకు షేర్ల మార్పిడి(స్వాప్‌) విధానాన్ని అవలంబించనుంది. ఈ ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు టాటా స్టీల్‌ వెల్లడించింది.

విలీనమిలా..
గ్రూప్‌లోని మెటల్‌ కంపెనీల విలీనానికి టాటా స్టీల్‌ షేర్ల మార్పిడి నిష్పత్తులను ప్రకటించింది. వీటి ప్రకారం ఆయా కంపెనీల వాటాదారుల వద్దగల ప్రతీ 10 షేర్లకుగాను టాటా స్టీల్‌ షేర్లను ఇలా కేటాయించనుంది. టీఆర్‌ఎఫ్‌ వాటాదారులకు 17, టీఎస్‌పీఎల్‌కు 67, టిన్‌ప్లేట్‌కు 33, టాటా మెటాలిక్స్‌కు 79 చొప్పున షేర్లను జారీ చేయనుంది. ఇండియన్‌ స్టీల్‌ – వైర్‌ ప్రొడక్ట్స్‌లో టాటా స్టీల్‌కు 95 శాతం వాటా ఉంది. టాటా స్టీల్‌ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ పూర్తి అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మిగిలిన మూడు కంపెనీలలో 75–60 శాతం మధ్య వాటాలను కలిగి ఉండగా.. టీఆర్‌ఎఫ్‌లో వాటా 34.11 శాతం మాత్రమే.  

అవకాశాలపై దృష్టి
అనుబంధ సంస్థల శక్తిసామర్థ్యాలను ఏకీకృతం చేయడం ద్వారా వాటాదారుల విలువ పెంపునకు అవకాశాలను సృష్టించుకోనున్నట్లు విలీనంపై టాటా స్టీల్‌ స్పందించింది. కంపెనీలన్నిటి మధ్య సమన్వయం ద్వారా ఒక సంస్థ సౌకర్యాలను మరొక కంపెనీ వినియోగించుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది మరింత సమర్థవంత వినియోగానికి దారి చూపుతుందని వివరించింది. అంతేకాకుండా మార్కెటింగ్, పంపిణీ నెట్‌వర్క్‌ సైతం పరస్పరం సహకరించుకోనున్నట్లు తెలియజేసింది. కాగా.. చంద్రశేఖరన్‌ అధ్యక్షతన గ్రూప్‌లోని కంపెనీలు బిజినెస్‌లను ఒక్కటిగా చేయడం ద్వారా పరస్పర లబ్దిని పొందనున్నట్లు ఈ ఏడాది మొదట్లోనే టాటా గ్రూప్‌ పేర్కొంది. ఈ బాటలో టాటా కన్జూమర్, టాటా కాఫీ విలీనాన్ని ప్రకటించింది.  ఇదే విధంగా 2024కల్లా ఎయిరేషియా, విస్తారాలను ఎయిరిండియా బ్రాండుకిందకు తీసుకురానున్నట్లు తెలియజేసింది. 2019 నుంచి టాటా స్టీల్‌ వివిధ రకాలుగా 116 సహచర కంపెనీల సంఖ్యను తగ్గించుకోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement