భారత్‌లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను నీతి ఆయోగ్ ఇటీవలే విడుదల చేసింది. దేశంలోని ఐదవ పేద రాష్ట్రంగా, ఈశాన్య భారతంలోని పేద రాష్ట్రంగా మేఘాలయ నిలిచింది. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో రైతుల ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన ఒక నివేదికలో మేఘాలయ అదరగొట్టింది. భారత్‌లో వ్యవసాయం ద్వారా వచ్చే సగటు నెలవారీ ఆదాయంలో మేఘాలయ తొలిస్థానంలో నిలిచింది. పంజాబ్ రెండో స్థానంలో, హర్యానా మూడో స్థానంలో నిలిచాయి.
మేఘాలయ రైతుల సంపాదన ఎంతంటే..!
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మేఘాలయ రైతులు అత్యధిక సగటు రోజువారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మేఘాలయ రైతులు సగటున నెలకు రూ. 29,000 సంపాదిస్తుండగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు నెలకు వరుసగా రూ. 26,000, రూ. 22,000 ఆర్జిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఇదిలా ఉండగా... జార్ఖండ్, ఒడిశా ,పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైతులు తక్కువ మేర నెలవారీ ఆదాయాలను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ మూడు రాష్ట్రాల రైతులు సగటున నెలకు రూ. 4,000, రూ. 5,000 , రూ. 6,000 కంటే తక్కువగా సంపాదిస్తున్నారని లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది.
తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే..తెలంగాణలోని రైతులు సగటున నెలకు రూ. 9403, ఆంధ్రప్రదేశ్ రైతులు నెలకు రూ. 10480 మేర సంపాదిస్తున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా రైతుల సగటు ఆదాయం దాదాపు రూ. 10,000గా నిర్ధారించబడింది. ఈ డేటాను ‘ అగ్రికల్చర్ హౌజ్ హోల్డ్స్ అండ్ ల్యాండ్ అండ్ లైవ్‌స్టాక్స్ హోల్డింగ్స్ ఆఫ్ రూరల్ హౌజ్‌హోల్డ్స్’ పేరుతో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌ఓ) సర్వే చేసింది.ఈ డేటా 2019 సంవత్సరానికి సంబంధించినది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే వ్యూహంతో ప్రభుత్వం పనిచేస్తోందని లోక్‌సభలో తెలిపారు.
చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment