చిన్నపిల్లల చదువు, వివాహాలు ఇతర భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారికి ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ అధీనంలో ఉండి స్థిరంగా వడ్డీ సమకూర్చే పీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహించే వారికిసైతం నష్టం కలిగేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరిచిన వారికి ఈ నిబంధనల వల్ల నష్టం కలుగుతుంది. మైనర్‌ల కోసం తెరిచే పీపీఎఫ్ ఖాతాదారులపై ఈ ప్రభావం పడుతుంది. కొంతమంది ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) దేశం విడిచి వెళ్లిపోయి, రెన్యూవల్ చేయకపోయినా తమ ఖాతా యాక్టివ్‌లోనే ఉంటుంది. అలాంటి వారి ఖాతాలను ఉపసంహరించుకునేలా విధానాల్లో మార్పులు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మైనర్ పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరిస్తే గతంలో దాదాపు 7.1 శాతం వడ్డీ చెల్లించేవారు. అయితే ఇకపై పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు అనుగుణంగా వడ్డీ చెల్లిస్తారు. అంటే మైనర్‌కు 18 ఏళ్లు వచ్చేవరకు 4 శాతం వడ్డీ ఇస్తారు. తర్వాత పీపీఎఫ్ నిబంధనల ప్రకారం వడ్డీ పెంచుతారు.
పిల్లల చదువులు, వివాహాల కోసం చాలా మంది తల్లిదండ్రులు వారి పేరుమీద పీపీఎఫ్ ఖాతా తెరుస్తున్నారు. అందులో స్థిరంగా వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. అయితే ఇకపై ఈ అవకాశం లేకుండా పోయింది.
ఇప్పటికే ఒక పీపీఎఫ్ ఖాతా నిర్వహిస్తున్నవారు సైతం రెండు కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. పీపీఎఫ్ డిపాజిట్ల వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు ఉండడం దీనికి ప్రధాన కారణం. దాంతో ఎక్కువ ఖాతాలు తెరిచి అధిక వడ్డీ సమకూరేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే ఇకపై ఈ వ్యవహారం కొనసాగదు.
ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహిస్తున్న ఖాతాదారులు ప్రాథమిక ఖాతా వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఖాతాల్లోని నగదును రూ.1.5 లక్షల పరిమితికి సర్దుబాటు చేస్తారు. అనంతరం ఇతర ఖాతాల్లో మిగిలిన నగదుపై ఎలాంటి వడ్డీ చెల్లించరు.
ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్
ప్రస్తుత పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం(పన్ను ఉండదు)గా ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల వల్ల ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలున్నవారు ఈక్విటీ మార్కెట్లను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కనీసం పదేళ్లు స్థిరంగా పెట్టుబడి పెట్టేవారు మ్యూచువల్ ఫండ్‌లు ఎంచుకుంటే పీపీఎఫ్ కంటే అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే రాబడులపై ట్యాక్స్ మిగుల్చుకోవాలంటే ‘ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్’లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. పదిహేనేళ్ల కాలపరిమితితో గరిష్ఠంగా ఏటా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఏదైనా అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైతే ఖాతా తెరిచిన ఐదేళ్ల తర్వాత ఒకసారి నగదు ఉపసంహరణకు అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment