న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ పరీక్షల డేటాను విడుదల చేసేందుకు అమెరికన్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చివరి దశ క్లినికల్ పరీక్షలలో తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు యూఎస్ దిగ్గజం ఫైజర్ ఇంక్ పేర్కొంది. ఇక స్ఫుత్నిక్ పేరుతో విడుదల చేసిన వ్యాక్సిన్ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) తెలియజేసింది. ఈ బాటలో తాజాగా మోడర్నా సైతం తుది దశ పరీక్షల డేటాను ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
దేశీయంగా..
ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల సెల్షియస్‌లో నిల్వ ఉంచవలసి ఉన్నట్లు వెలువడిన వార్తలతో ఫార్మా రంగ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దేశీయంగా ఈ వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీ వంటివి సమస్యాత్మకంగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. చివరి దశ పరీక్షలకు సంబంధించిన తొలి మధ్యంతర విశ్లేషణ తమ వద్ద ఉన్నట్లు మోడర్నా చెబుతోంది. ఈ డేటా ద్వారా వ్యాక్సిన్ ఎంత సురక్షితమన్న అంశాన్ని తెలుసుకునే వీలున్నట్లు తెలియజేసింది. విశ్లేషణకు వీలుగా ఈ డేటాను స్వతంత్ర పర్యవేక్షక బోర్డుకి నివేదించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వ్యాక్సిన్ పరీక్షల ఫలితాలను విశ్లేషించి సూచనలు చేయనున్నట్లు తెలియజేసింది.
నోవావాక్స్..
ఐసీఎంఆర్ సహకారంతో రూపొందిస్తున్న కోవిడ్‌షీల్డ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షల కోసం దేశీయంగా ఎన్‌రోల్‌మెంట్ పూర్తియినట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. మరోవైపు నోవావ్యాక్స్, సీరమ్ అభివృద్ధి చేస్తున్న కోవావ్యాక్స్‌కూ ఐసీఎంఆర్ సేవలు అందిస్తోంది. కాగా.. స్ఫుత్నిక్-వి వ్యాక్సిన్‌పై దేశ, విదేశాలలో ఇటీవల క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీటి మధ్యంతర ఫలితాలు 92 శాతం విజయవంతమైనట్లు ఆర్‌డీఐఎఫ్ చెబుతోంది. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో రూపొందిస్తున్నవ్యాక్సిన్ 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు ఫైజర్ ప్రకటించిన మరుసటి రోజు రష్యన్ వ్యాక్సిన్ వివరాలు వెల్లడికావడం గమనార్హం! దేశీయంగా వ్యాక్సిన్లను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ చేస్తుంటారని ఫార్మా రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ బాటలో అతితక్కువ టెంపరేచర్‌ను తీసుకుంటే.. మైనస్ 25 డిగ్రీలు మాత్రమేనని చెబుతున్నారు. వెరసి ఇందుకు అనువైన వ్యాక్సిన్లు మాత్రమే దేశీయంగా వినియోగించేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment