ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా? | Mukesh Ambani ambitious succession plan for Reliance Industries | Sakshi
Sakshi News home page

ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా?

Published Thu, Nov 25 2021 8:01 PM | Last Updated on Thu, Nov 25 2021 8:33 PM

Mukesh Ambani ambitious succession plan for Reliance Industries - Sakshi

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు కోసం ఆసియాలోని అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన వారసుడు ఎవరు అనే దాని విషయంలో ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. వారుసుల విషయంలో ఆసియాలోని ఇతర సంపన్న కుటుంబాలు చేసిన తప్పులను తను చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ముకేష్ అంబానీ కుటుంబంలో అంతర్యుద్ధం రాకుండా ఉండటానికి నిపుణులతో చర్చిస్తున్నట్లు వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్ ఒక కథనం ప్రచురితం చేసింది. 

బ్లూంబర్గ్ కథనం ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసత్వ విషయంలో ప్రణాళికలను రచిస్తున్నారు. కంపెనీ ఫైలింగ్స్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో అంబానీ కుటుంబం ప్రస్తుత వాటా మార్చి 2019లో ఉన్న 47.27 శాతం నుంచి 50.6 శాతానికి పెరిగింది. రిలయన్స్ వైభవం భవిష్యత్తులో కూడా తగ్గకుండా ఉండటానికి యువ తరం అంబానీలను సిద్ధం చేస్తున్నారు. జూన్ నెలలో జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) ముఖేష్ అంబానీ ఇలా మాట్లాడారు.. "ఇషా, ఆకాశ్, అనంత్ నేతృత్వంలో రిలయన్స్ మరి౦త సుసంపన్న౦ అవుతుంది అనడంలో నాకు స౦దేహ౦ లేదు" అన్నారు. 

(చదవండి: రూ.10 వేల పెట్టుబడితో రూ. 2 లక్షలు లాభం!)

ప్రస్తుతం అతని కవల పిల్లలు ఆకాశ్, ఇషా అంబానీలు ఇద్దరూ రిటైల్ & టెలికామ్ వ్యాపారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. 2014లో వారిద్దరూ ఆర్ఐఎల్ టెలికాం, రిటైల్ వ్యాపారాల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ప్రస్తుతం, అతని చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అతను డైరెక్టర్‌గా రిలయన్స్ పునరుత్పాదక శక్తి, చమురు & రసాయన యూనిట్ల భాద్యతలు కూడా చూస్తున్నాడు. 

అంబానీ వారసత్వ ప్రణాళిక 
208 బిలియన్ డాలర్ల(సుమారు రూ.15.60 లక్షల కోట్ల) విలువైన ఈ వ్యాపార సామ్రాజ్యం అన్నీ రంగాలలో విస్తరించి ఉంది. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కోనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేశ్ అంబానీ తాజాగా వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారు. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నారు. కంపెనీ ప్రధాన కార్యకలాపాలను పూర్తిస్థాయి ప్రొఫెషనల్స్కు అప్పగిస్తారు. వారంతా బయటవారే ఉంటారు. 

అంబానీ కుటుంబ అంతర్యుద్ధం
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరజ్ లాల్ హిరాచంద్ అంబానీ 1973లో రిలయన్స్ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ అంచలంచెలుగా ఎదిగింది. కానీ, 2002లో ధీరుబాయ్ అంబానీ ఆకస్మిక మరణం తర్వాత కుటుంబం అనిశ్చితిలో మునిగిపోయింది. ఆ సమయంలో ముఖేష్, అతని సోదరుడు అనిల్ అంబానీ ఇద్దరూ వ్యాపారంలో పాల్గొన్నప్పటికీ, ఒకరినొకరు అడగకుండా మరొకరు నిర్ణయాలు తీసుకువిస్తున్నారని నమ్మడంతో విభేదాలు రావడం ప్రారంభించాయి.

(చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా..?)

కొన్ని విషయాలలో ఇద్దరూ సోదరులు ప్రధాన నిర్ణయాలపై విభేదించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. 2005లో వారి తల్లి కోకిలాబెన్ రిలయన్స్ ఆస్తులను విభజించడానికి ముందు ఈ అంతర్యుద్ధం మూడు సంవత్సరాలు వరకు కొనసాగింది. ముఖేష్ అంబానీకి రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, వస్త్ర వ్యాపారాలను అందించగా.. అనిల్ అంబానీకి టెలికమ్యూనికేషన్స్, ఆస్తి-నిర్వహణ, వినోదం, విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలకు బాధ్యతలు అప్పజెప్పింది. ఆ తర్వాత ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచలంచెలుగా అభివృద్ది చేసి ఈ స్థాయికి తీసుకొని వచ్చారు.

వాల్టన్ కుటుంబ వారసత్వ ప్రణాళిక
ప్రముఖ వాల్ మార్ట్ సంస్థ అమెరికన్ వ్యాపారవేత్త శామ్ వాల్టన్ చేత స్థాపించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ సంస్థగా ఎదిగింది. అతని కుమారుడు రాబ్ వాల్టన్, అతని మేనల్లుడు స్ట్యూర్ట్ వాల్టన్, ఇద్దరూ వాల్ మార్ట్ బోర్డులో ఉన్నారు. సామ్ మనవడు గ్రెగ్ పెన్నర్ 2015లో కంపెనీ చైర్మన్ గా నియమితులయ్యారు. శామ్ వాల్టన్ తాను చనిపోవటానికి 40 ఏళ్ల ముందే కుటుంబ వాటాల్ని ట్రస్టుకు బదిలీ చేసి.. కుటుంబ సభ్యులకు ఆ సంస్థ బోర్డు డైరెక్టర్ బాధ్యతల్ని అప్పజెప్పారు.

ఇప్పటికీ ఆ సంస్థ చీలిపోకుండా ఉందంటే అందుకు ఆయన అనుసరించిన వ్యూహమేనని నిపుణులు చెబుతారు. ఇప్పటికి వాల్ మార్ట్ సంస్థలో 47 శాతం వాటాను ట్రస్టులు, వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ రూపంలో వాల్ మార్ట్ కుటుంబీకుల చేతుల్లోనే ఉండటం గమనార్హం.ఇప్పుడు అదే విధంగా, ముకేశ్ అంబానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని చూస్తున్నారని బ్లూంబర్గ్ పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement