న్యూఢిల్లీ: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఇటీవల దుబాయ్‌లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన అంబానీ తాజాగా మరొక బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేశారు. తద్వారా కేవలం నెల రోజుల్లోనే మరో రికార్డు స్థాయి రియల్ ఎస్టేట్ డీల్‌ను సాధించడం విశేషం. అయితే ప్రైవేట్ వ్యవహారంగా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.
ఇండియా రెండో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ గత నెలలో దుబాయిలో రూ.640 కోట్లతో లగ్జరీ విల్లాను సొంతం చేసుకున్నారు. ఈ విల్లాను తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకోసం కొనుగోలు చేశారు. తాజాగా కువైట్ వ్యాపారవేత్త మహ్మద్ అల్షాయా కుటుంబం నుండి సుమారు 163 మిలియన్లడాలర్లవిలువైన పామ్ జుమేరా మాన్షన్‌ను కొనుగోలు చేశారని కొనుగోలుదారుడి పేరు బహిర్గతం చేయకుండా దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ నివేదించింది.
కాగా ముఖేశ్ అంబానీ విదేశాలలో భారీగా ఆస్తులను కొనుగోలు చేసుకుంటున్నారు. 79 మిలియన్ల డాలర్లతో ఐకానిక్ యూకే కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్‌ను రూ.592 కోట్లతో కొనుగోలు చేశారు. దీన్ని పెద్ద కుమారుడు ఆకాశ్‌కు కేటాయించినట్టు సమాచారం. అలాగే కుమార్తె ఈశా అంబానీ కోసం న్యూయార్క్‌లో కూడా ఖరీదైన భవనం కోసం వెతుకుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అంతేకాదు సింగపూర్ ఫ్యామిలీ ఆఫీసు ఏర్పాటులో అంబానీ బిజీగా ఉన్నారని ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment