92 మంది సంపన్నులకు కేంద్రం
బీజింగ్‌ను దాటిన దేశ ఆర్థిక రాజధాని
హురున్ గ్లోబల్ రిచ్‌లిస్ట్‌లో వెల్లడి
ముంబై: బిలియనీర్ల విషయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై తాజాగా బీజింగ్‌ను అధిగమించింది. మంగళవారం విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్టు ప్రకారం ముంబైలో 92 మంది అత్యంత సంపన్నులు ఉండగా బీజింగ్‌లో ఈ సంఖ్య 91గా ఉంది. ఇక చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉండగా భారత్‌లో 271 మంది ఉన్నారు. దేశీయంగా కుబేరుల మొత్తం సంపద 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
గత ఏడాది వ్యవధిలో ఆయన సంపద మరో 40 శాతం (33 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఇక హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో గణనీయంగా దెబ్బతిన్న గౌతమ్ అదానీ తిరిగి కోలుకున్నారు. ఆయన సంపద 62 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయంగా అంబానీ పదో స్థానంలో ఉండగా, అదానీ 15వ స్థానంలో ఉన్నారు. 231 బిలియన్ డాలర్లతో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ నంబర్ వన్‌గా ఉన్నారు. కొత్త బిలియనీర్లయిన వారి విషయంలో చైనాను భారత్ అధిగమించింది. భారత్ నుంచి ఈ లిస్టులో 94 మంది చోటు దక్కించుకోగా, చైనా నుంచి 55 మందికి చోటు దక్కింది. గత ఏడాది వ్యవధిలో ముంబైలో 27 మంది బిలియనీర్లు కాగా, బీజింగ్‌లో ఆరుగురు మాత్రమే ఈ హోదా దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment