న్యూఢిల్లీ: ఆర్థిక సేవల రంగం పరిధిలోకి పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకురావడానికి మరింత సమ్మిళిత వ్యవస్థ అవసరమమని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మహిళలు సులభతరంగా ఆర్థిక సేవలు పొందేందుకు డిజిటల్ సాధనాలు, వినూత్న పథకాలు వంటివి తోడ్పడగలవని ఆయన తెలిపారు. భారత్‌లోని మహిళలకు ఆర్థిక తోడ్పాటులో జన్ ధన్ పథకం ప్రాధాన్యం అంశంపై రూపొందిన నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి దీన్ని రూపొందించాయి.
మహిళా కరెస్పాండెంట్స్ నియామకం వంటి వినూత్న విధానాలతో బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసుల రంగం పరిధిలోకి మరింత మంది మహిళా కస్టమర్లను తీసుకువచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవకాశాలు ఉన్నాయని కాంత్ చెప్పారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి సాధించడానికి జన్ ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం) ఊతంతో, 40 కోట్ల మంది ప్రజలు అధికారికంగా ఆర్థిక సేవల పరిధిలోకి వచ్చారని పేర్కొన్నారు. మరోవైపు, మహిళలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేసేందుకు జన్ ధన్ ప్లస్ విధానాన్ని పాటించవచ్చని నివేదిక సూచించింది. దీని ప్రకారం నాలుగు నెలల పాటు జన్ ధన్ ఖాతాలో రూ. 500 డిపాజిట్ చేస్తే.. ప్రోత్సాహకంగా రూ. 10,000 మేర రుణం/ఓవర్‌డ్రాఫ్ట్ ఇవ్వొచ్చని పేర్కొంది. 2020 ఫిబ్రవరి–2020 ఆగస్టు మధ్యకాలంలో 101 బీవోబీ శాఖల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా 50,000 మంది పురుషులు, మహిళ కస్టమర్లు జన్ ధన్ ప్లస్ ఖాతాలు తీసుకున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment