ముంబై: ‘భారత వాహన పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.7.5 లక్షల కోట్లు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక పన్నులు ఇవ్వడంతోపాటు గరిష్టంగా ఉపాధి అవకాశాలను ఈ రంగం కలిగి ఉంది. 2024 చివరి నాటికి పరిశ్రమను రూ.15 లక్షల కోట్లకు చేర్చడం నా కల. ఇది సాధ్యం కూడా’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ముడి చమురు దిగుమతులు, కాలుష్యాన్ని తగ్గించడం కోసం వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని గురువారం పిలుపునిచ్చారు. దేశంలో తొలిసారిగా ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండీషన్డ్ బస్‌లను ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘దేశంలో డీజిల్, పెట్రోల్ కారణంగా 35% కాలుష్యం ఉంది. ఈ నేపథ్యంలో దిగుమతులకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్య రహిత, స్వదేశీ వాహనాలు అవసరం’ అని తెలిపారు.
బస్‌లో 66 మంది..: హిందూజా గ్రూప్‌లో భాగమైన అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ వాహన విభాగమైన స్విచ్ మొబిలిటీ ఈఐవీ 22 పేరుతో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్‌లను తయారు చేసింది. ప్రస్తుత డబుల్ డెక్కర్ స్థానంలో 66 సీట్లు గల ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ముంబైలో బృహన్‌ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై, ట్రాన్స్‌పోర్ట్ (బీఈఎస్‌టీ) నడపనుంది. బీఈఎస్‌టీ నుంచి 200 బస్‌లకు ఇప్పటికే స్విచ్ మొబిలిటీ ఆర్డర్ దక్కించుకుంది. ఇతర నగరాల్లోనూ వీటిని పరిచయం చేసేందుకు తమ కంపెనీతో ప్రభుత్వ సంస్థలు చర్చలు జరుపుతున్నాయని స్విచ్ మొబిలిటీ ఇండియా సీఈవో మహేశ్ బాబు తెలిపారు. యూకేలోనూ స్విచ్ మొబిలిటీ డబుల్ డెక్కర్ ఈ–బస్‌లు పరుగెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment