మన దేశంలో త్వరలో లాంచ్ కానున్న టెస్లా కార్లకు పోటీగా ఓలా ఎలక్ట్రిక్ త్వరలో కార్లను రోడ్డు మీదకు తీసుకొనిరావలని చూస్తుంది. ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు, ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ 2023లో ఓలా ఎలక్ట్రిక్ కారును రోడ్డు మీదకు తీసుకొనిరావలని యోచిస్తున్నారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1ను ఘనంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల క్రితం కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పగానే 24 గంటల్లో లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించింది.
మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఓలా రావడంతో ఒక్కసారిగా ఆ మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడింది. ఓలా ఎస్1 లాంచ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా చొరవను బలపరచడానికి స్థానికంగా లభించే 90% భాగాలతో ఎలక్ట్రిక్ కారును రూపొందించడమే తన లక్ష్యమని అగర్వాల్ చెప్పారు. టెస్లా ఇంకా కార్లను దేశంలోకి తీసుకొనిరావడానికి ప్రణాళికలు రచిస్తున్న సమయంలో భవిష్ అగర్వాల్ ఈ వ్యాఖ్యాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. జూలైలో ఎలోన్ మస్క్ అమెరికన్ ఈవీ కంపెనీ టెస్లా దేశంలో దిగుమతి చేసుకున్న వాహనాలతో మొదట విజయం సాధిస్తే భారతదేశంలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎలన్ మస్క్‌ను వ్యతిరేకించిన అగర్వాల్
టెస్లా తన వాహనాలను భారతదేశంలో లాంచ్ చేయాలని అనుకుంటున్నట్లు మస్క్ చెప్పారు. "కానీ, దిగుమతి సుంకాలు ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో లేని విధంగా అత్యధికంగా ఉన్నాయి!" అని అన్నారు. అందుకే దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకలను తగ్గించాలని ప్రభుత్వాన్ని మస్క్ కోరారు. టెస్లా పిలుపును స్వాగతిస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ పేర్కొన్నారు. భారత్‌లోని దిగుమతి సుంకాలను, కస్టమ్ డ్యూటీలను తగ్గించాలని టెస్లా అధినేత ఎలన్ మస్క్, హూందాయ్ ఎండీ ఎస్‌ఎస్ కిమ్‌లు చేసిన ప్రతిపాదనను భవీష్ అగర్వాల్ తప్పుబట్టారు.
భారత్‌లోనే ఎలక్ట్రిక్ వాహనాలను నిర్మించగల సామర్థ్యంపై ఆయా కంపెనీలు విశ్వాసం కలిగి ఉండాలని సూచించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడంతో ప్రపంచంలోని తయారీ రంగ దిగ్గజాలను భారత్‌లోకి ఆకర్షించ వచ్చునని తన భవీష్ పేర్కొన్నారు. ప్రస్తుతం, కేంద్రం పూర్తిగా దిగుమతి చేసుకున్న కార్లపై 100% దిగుమతి సుంకాన్ని విధిస్తుంది. 'భారతదేశంలోకి వాహనాలను దిగుమతి చేసుకోవాలనుకునే వారు దేశంలో పెట్టుబడులు పెట్టాలి' అని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్కూటర్ ను లాంఛ్ చేస్తూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment