వచ్చే ఏడాది నుంచి హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అమలు చేసే విషయంలో సంస్థలు యూటర్న్ తీసుకోనున్నాయి. కొన్ని కంపెనీలు వచ్చే ఏడాది మొత్తం ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితం చేయాలని చూస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్ని వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కార్యాలయాలకు ఆహ్వానించాలని భావించాయి. కానీ ప్రపంచ దేశాల్ని ఒమిక్రాన్ వణికిస్తుండడంతో రిటర్న్- టు- ఆఫీస్ ప్లాన్ అమలు చేయడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
►ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుల‍్లో విధులు నిర్వహించేలా కార్యాలయాల్ని సిద్ధం చేశాయి. కానీ అనూహ్యంగా ఒమిక్రాన్ భయం ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు రప్పించే అంశాన్ని మరింత ఆలస్యం చేయనున్నాయి.
►డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రభావం తక్కువేనని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు యూఎస్‌తో పాటు ఇతర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉద్యోగులతో కార్యాలయాల్లో విధుల నిర్వహణ సంస్థలకు కత్తిమీద సాములా మారింది.
►బ్రిటన్, డెన్మార్క్, నార్వే, స్వీడన్‌కు చెందిన కంపెనీలు ఓమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని కోరుతున్నాయి.
►టెక్ దిగ్గజం గూగుల్, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ..ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలిపించడంపై మరింత ఆలస్యం చేయనున్నాయి.
►ఇప్పటికే ఫేస్‌బుక్ (మెటా), రైడ్‌షేరింగ్ కంపెనీ 'లిఫ్ట్' వచ్చే ఏడాది ప్రారంభంలో ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేయాలన్న ఆంక్షలపై పునరాలోచనలో పడ్డాయి. ఫేస్‌బుక్ వచ్చే ఏడాది జున్ చివరి నాటికి ఉద్యోగుల్ని ఆఫీస్‌లకు పిలిపించాలని ప్రయత్నించింది. కానీ ఒమిక్రాన్ ప్రభావంతో మరింత ఆలస్యం కానుంది. అప్పటి వరకు ఉద్యోగులు ఇంటికే పరిమితం కానున్నారు. లిఫ్ట్ సంస్థ వచ్చే ఏడాది అంతా ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి రావాల్సిన అవసరం లేదని పేర్కొంది.
►అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్స్యూరెన్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ జెఫ్ లెవిన్ షెర్జ్ ఒమిక్రాన్‌పై స్పందించారు. 18 నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగులు త్వరలో ఆఫీస్‌ల నుంచి విధులు నిర్వహిస్తారని భావించినట్లు తెలిపారు. కానీ ఒమిక్రాన్ విజృంభణతో మరింత ఆలస్యం కావడమే కాదు.. ఉద్యోగుల పట్ల సంస్థలు మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.
►కోవిడ్‌కు ముందు ఉన్న విధంగా ఆఫీసుల్లో పనిచేసే వాతావరణం తిరిగి ఇప్పట్లో వచ్చేలా లేదని ఒమిక్రాన్‌తో అర్ధమైందని అడ్వటైజింగ్ ఏజెన్సీ క్రియేటివ్ సివిలైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గిసెలా గిరార్డ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment