న్యూఢిల్లీ: క్రిప్టోలతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అంటూ ఒకవైపు ఆర్‌బీఐ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. నియంత్రణలపరమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. మరోవైపు క్రిప్టో మార్కెట్ దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. 2021లోనే ఇప్పటి వరకు 100 స్టార్టప్‌లు క్రిప్టోలకు సంబంధించి ఏర్పాటయ్యాయంటే ఈ మార్కెట్ ధోరణులు ఎలా ఉందీ అర్థం చేసుకోవచ్చు. దేశంలో క్రిప్టో స్టార్టప్‌ల సంఖ్య 400కు చేరుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
క్రిప్టోలకు సంబంధించి పలు రకాల సేవలను ఈ స్టార్టప్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి క్రిప్టో స్టార్టప్‌లు 380 వరకు ఉండగా.. నాన్ ఫంగిబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టీ) ఆధారిత స్టార్టప్‌లు మరో 12 వరకు ఉన్నాయని సమాచారం. ‘‘కొత్త కాయిన్ల ఏర్పాటుపై ఎన్నో స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. కొన్ని స్టార్టప్‌లు క్రిప్టోలకు సంబంధించి ఇన్వెస్టర్ల కమ్యూనిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటి కార్యకలాపాలు ఈ ఏడాది మరింత బలోపేతమయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 100 వరకు స్టార్టప్‌లు కొత్తగా ఏర్పాటు కాగా, 2020లోనూ 50–60 స్టార్టప్‌లు మొగ్గతొడిగాయి’’ అని క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ ‘యూనోకాయిన్’ సహ వ్యవస్థాపకుడు సాత్విక్ విశ్వనాథ్ తెలిపారు.
కోర్టు ఆదేశాల తర్వాత మరింత వృద్ధి
క్రిప్టోకరెన్సీలకు సంబంధించి చెల్లింపులను అంగీకరించరాదంటూ గతేడాది బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించడం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో క్రిప్టో లావాదేవీలు దేశీయంగా నిలిచిపోయాయి. కానీ, ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేయడం క్రిప్టో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందేందుకు సాయపడిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో 2020 పూర్తి సంవత్సరంతో పోలిస్తే.. 2021 మొదటి ఆరు నెలల్లోనే క్రిప్టో స్టార్టప్‌ల నిధుల సమీకరణ 73 శాతం పెరిగింది. బెంగళూరుకు చెందిన క్రిప్టో ఎక్సేంజ్ కాయిన్‌స్విచ్ కుబేర్, ముంబైకు చెందిన కాయిన్‌డీసీఎక్స్ ఇప్పటికే ‘యూనికార్న్’ స్థాయి విలువల(బిలియన్ డాలర్లు)కు చేరాయి. సగటు ఇన్వెస్టర్ క్రిప్టోల్లో చేసే పెట్టుబడులు ఏడాది క్రితం రూ.6,000–8,000 మధ్య ఉంటే, అది రూ.10,000కు పెరిగింది.
రక్షణ కావాలి కానీ, నిషేధం కాదు..
‘‘విధాన నిర్ణేతలు క్రిప్టోల విషయంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన నియంత్రణలు ప్రవేశపెట్టే ముందు.. క్రిప్టో ఎకోసిస్టమ్ వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అన్నది పరిశ్రమ వర్గాల డిమాండ్‌గా ఉంది. ఫిన్‌టెక్ సంస్థ వాల్‌రస్ వ్యవస్థాపకుడు అయిన భగబాన్ బెహెరా సైతం ఈ విభాగంలో వృద్ధిని చూసి క్రిప్టో మార్కెట్లోకి ప్రవేశించడం గమనార్హం. సోషల్ క్రిప్టో ఎక్సేంజ్ డెఫీని ఏర్పాటు చేయాలని బెహెరాతోపాటు ఇతర వ్యవస్థాపకులు నిర్ణయించుకున్నారు. క్రిప్టోలకు సంబంధించి ఇన్వెస్టర్లు తమ ప్రొఫైల్‌ను ఈ సోషల్ ఎక్సేంజ్ ప్లాట్‌ఫామ్‌పై నమోదు చేసుకోవడంతోపాటు, తమ పోర్ట్‌ఫోలియో వివరాలు, తమ ఆలోచనలను పంచుకునే వేదికగా దీన్ని మలచాలన్నది వ్యవస్థాపకుల ఆలోచనగా ఉంది. ‘‘భారత్‌లో క్రిప్టోల ఎన్‌ఎఫ్‌టీ విభాగం ఆరంభంలోనే ఉంది. సులభమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, అంతిమంగా క్రిప్టో మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో క్రెడిట్‌కార్డ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సిప్ ప్లాన్‌ను ప్రారంభించాలన్నది ఆలోచన’’ అని బెహెరా తెలిపారు.
వృద్ధి అవకాశాలు..
ఎన్‌ఎఫ్‌టీల మార్కెట్ మన దేశంలో క్రమంగా బలపడుతోంది. ఎక్సేంజ్‌ల తరఫున అన్ని రకాల ఎన్‌ఎఫ్‌టీ స్టార్టప్‌లు.. క్రిప్టో ఎక్సేంజ్‌లు, ఏపీఐలు, టూల్స్, మౌలిక సదుపాయాల వృద్ధికి సంబం ధించి ఇప్పటికే దేశంలో ఏర్పాటయ్యాయి. ‘‘వినోదం, క్రీడలు, యుటిలిటీ ఆధారిత ఎన్‌ఎఫ్‌టీల పట్ల ప్రజల్లో మంచి ఉత్సాహం ఉంది. మార్కెట్లో ఎన్‌ఎఫ్‌టీలకు సంబంధించి ఫోమో (కోల్పోతామనే ధోరణి) వాతావరణం కూడా నెలకొని ఉంది. ఇది మరికొంత కాలం పాటు ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఎన్‌ఎఫ్‌టికల్లీ వ్యవస్థాపకుడు, సీఈవో తోషేంద్ర శర్మ తెలిపారు.
తొందరపడొద్దు.. ప్రశాంతంగా ఉండండి: క్రిప్టో పరిశ్రమ
న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం సూక్ష్మంగా వ్యవహరించాలని పరిశ్రమ కోరింది. ఇన్వెస్టర్లు తొందరపాటుతో ఓ ముగింపు నిర్ణయానికి రావద్దని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టోలకు సంబంధించి ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021’ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అన్ని రకాల క్రిప్టోకరెన్సీలను ఈ బిల్లు నిషేధించనున్నట్టు సమాచారం వెలుగు చూడడంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలకు మొగ్గు చూపించారు. ఫలితంగా కొన్ని క్రిప్టోలు బుధవారం నష్టపోయాయి. ఈ క్రమంలో క్రిప్టో ఎక్సేంజ్‌లు, పరిశ్రమకు చెందిన ఇతరులు స్పందించారు. ‘‘దేశంలో క్రిప్టోల వృద్ధి అవకాశాలపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన క్రిప్టో ఇన్వెస్టర్లు, క్రిప్టో స్టార్టప్‌ల ఆకాంక్షలకు అనుగుణంగా బిల్లు ఉంటుందని భావిస్తున్నాం. నూతన బ్లాక్‌చైన్ ప్రాజెక్టుల అభివృద్ధికి వీలుగా బిల్లు సౌకర్యవంతంగా ఉండాలి. కొత్త క్రిప్టో కరెన్సీ ఏదైనా కానీ, భారత ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అవ్వడానికి ముందు నిర్ధేశిత ప్రామాణిక విధానం అంటూ ఒకటి ఉండాలి. పన్నుల అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం’’ అని బైయూకాయిన్ సీఈవో శివమ్ తక్రాల్ పేర్కొన్నారు.
అందరితో సంప్రదిస్తున్నాం..
‘‘ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణే ప్రధానంగా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు చేస్తున్నాం. కస్టమర్లకు రక్షణ ఉండాలి. ఆర్థిక స్థిరత్వం బలోపేతం కావాలి. క్రిప్టో టెక్నాలజీ విప్లవం నుంచి భారత్ ప్రయోజనం పొందాలన్న దానిపై విస్తృతమైన అంగీకారం వచ్చింది’’ అని కాయిన్‌స్విచ్ కుబేర్ సీఈవో ఆశిష్ సింఘాల్ తెలిపారు. ఇన్వెస్టర్లు ప్రశాతంగా ఉండాలని సూచిం చారు. ‘‘తగినంత విశ్లేషణ, ఆలోచనతో కూడిన నియంత్రణ విధానం ఈ టెక్నాలజీని విస్తృతంగా మోదించడానికి దారితీస్తుంది’’ అని కాయిన్‌డీసీఎక్స్ అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు.
క్రిప్టోలకు చట్టబద్ధత వద్దు
54 శాతం మంది అభిప్రాయమిదే
న్యూఢిల్లీ: దేశంలో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం లేదని 54 శాతం మంది అభిప్రాయంతో ఉన్నారు. వీటిని విదేశాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులుగా పరిగణిస్తే చాలని చెప్పారు. డిజిటల్ కమ్యూనిటీ ‘లోకల్‌సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా 342 జిల్లాల పరిధిలోని 56,000 మంది అభిప్రాయాలను ఈ సర్వే కింద లోకల్ సర్కిల్స్ సేకరించింది. క్రిప్టో కరెన్సీలను చట్టపరంగా అనుమతించాలని 26 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 87 శాతం మంది భారతీయ కుటుంబాలు క్రిప్టోల్లో ట్రేడింగ్ లేదా పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. క్రిప్టోల ప్రకటనల్లో రిస్క్‌ల గురించి స్పష్టంగా పేర్కొనడం లేదని 9,942 మంది చెప్పారు.
క్రిప్టోల్లో మిగిలేవి కొన్నే: రాజన్
న్యూఢిల్లీ: క్రిప్టోల్లో చివరికి కొన్నే మిగిలి ఉంటాయని, మిగతవాన్నీ కనుమరుగైపోతాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అభిప్రాయపడ్డారు. ‘‘చెల్లింపుల కోసం 6,000కుపైగా క్రిప్టో కరెన్సీలు మనకు నిజంగా అవసరమా? ఒకటి లేదా రెండు లేదంటే కొన్ని మాత్రమే చెల్లింపులకు వీలుగా మిగిలి ఉంటాయి. అది కూడా టెక్నాల జీ అత్యంత ఉపయోగకరంగా ఉంటే. కనుక భవిష్యత్తులో చాలా వరకు క్రిప్టోలు అధిక వ్యాల్యూమ్‌తో కొనసాగడం కష్టమే’’ అని ఒక టీవీ చానల్‌కు రాజన్ చెప్పారు. నియంత్రణలో లేని చిట్‌ఫండ్స్ మాదిరే క్రిప్టోలతోనూ నష్టపోయే సమస్య ఎదురవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment