
Union Budget 2022: డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు, సమర్థమంతమైన కరెన్సీ నిర్వహణకు తోడ్పడేలా రిజర్వ్ బ్యాంక్ తాజాగా దేశీ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టబోతోంది. ఏప్రిల్‌తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని అందుబాటులోకి తేనుంది. మంగళవారం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం వెల్లడించారు. ‘కరెన్సీ మేనేజ్‌మెంట్ వ్యవస్థను మరింత సమర్థంగా, తక్కువ వ్యయాలతో నిర్వహించేందుకు డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో 2022–23 నుంచి బ్లాక్‌చెయిన్, ఇతర టెక్నాలజీల ఆధారిత డిజిటల్ రూపీని ఆర్‌బీఐ ప్రవేశపెడుతుంది‘ అని ఆమె పేర్కొన్నారు. ప్రాథమికంగా సబ్సిడీ పథకాలకు సంబంధించిన చెల్లింపులు మొదలైన వాటికి దీన్ని ఉపయోగించవచ్చని పరిశ్రమవర్గాలు తెలిపాయి. నగదు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఊతమివ్వగలదని, అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో సానుకూల మార్పులు తేగలదని పేర్కొన్నాయి. రియల్ టైమ్‌లో, వేగవంతంగా సీమాంతర రెమిటెన్సులకు కూడా తోడ్పడగలదు. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలకు లావాదేవీల వ్యయాలు కూడా తగ్గగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
డిజిటల్ కరెన్సీ అంటే..
ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో బిట్‌కాయిన్ వంటి డిజిటల్/క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు కుప్పతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువగా ఉండటంతో వీటి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు దీన్ని ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా మదుపు చేస్తున్నారు. అయితే, ఈ తరహా అనధికారిక కరెన్సీల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి.
అక్కడ ఈ క్రోనా
ఈ నేపథ్యంలో దేశాల ప్రభుత్వాలు అధికారికంగా డిజిటల్ కరెన్సీలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే భారత్ కూడా డిజిటల్ రూపీకి రూపమిస్తోంది. దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దీన్ని జారీ చేస్తుంది. భౌతికంగా పేపర్ రూపంలో జారీ చేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారిక పేపర్ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో రూపొందించడం వల్ల లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటులో కూడా దీనికి చోటు కల్పిస్తారు కాబట్టి చట్టబద్ధత ఉంటుంది. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే ఈ తరహా ‘ఈ–క్రోనా’ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment