న్యూఢిల్లీ: పోటీని అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్న ఆరోపణలతో పలు గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సమన్లు జారీ కానున్నాయి. ఇందుకు గురువారం పార్లమెంటరీ కమిటీ నిర్ణయాన్ని తీసుకుంది. వెరసి గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, ట్విటర్ తదితరాలకు సమన్లు జారీ కానున్నాయి. తద్వారా ఆయా కంపెనీల పోటీతత్వ విధానాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై తదుపరి సమావేశాన్ని పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 12న నిర్వహించే అవకాశముంది. పలు టెక్ దిగ్గజాలు పోటీ నివారణా పద్ధతులు అవలంబిస్తున్న ఆరోపణలపై ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూలంకషంగా చర్చించింది.
చదవండి: హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్, యువతకు ఐటీ ఉద్యోగాల రూప కల్పనే లక్ష్యంగా!
ఆపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు ఈ అంశాలను నివేదించింది. కాగా.. పోటీ నివారణ పద్ధతులపై సరైన రీతిలో స్పందించేందుకు వీలుగా డిజిటల్ మార్కెట్స్ అండ్ డేటా యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు సీసీఐ పేర్కొంది. తద్వారా గ్లోబల్ టెక్ దిగ్గజాలపై యాంటీకాంపిటీషన్ చర్యలు చేపట్టేందుకు సీసీఐ చట్ట సవరణల కోసం కొత్త బిల్లును తీసుకురానున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా డిజిటల్ విభాగంలో పలు పరిశోధనలను చేపట్టినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, యాపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మేక్‌మైట్రిప్–గోఐబిబో, స్విగ్గీ, జొమాటో తదితరాలున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment