న్యూఢిల్లీ: జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను తీసుకురావడం ఇప్పట్లో సాధ్యం కాని విషయమని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ తేల్చేశారు. జీఎస్‌టీ కిందకు వస్తే వార్షికంగా రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుందంటూ.. ఇందుకు ఏ రాష్ట్రం కూడా సుముఖంగా లేదన్నారు. రాష్ట్రాలకు రూ.2లక్షల కోట్ల నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలంటూ ప్రశ్నించారు. జీఎస్‌టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు మరో 8–10 ఏళ్ల పాటు వేచి చూడాల్సి రావచ్చని పేర్కొన్నారు. ఆర్థిక బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో బుధవారం సుశీల్‌మోదీ మాట్లాడారు.
కేంద్రం, రాష్ట్రాలు కలసి ఉమ్మడిగా పెట్రోలియం ఉత్పత్తులపై ఏటా రూ.5 లక్షల కోట్ల మేర పన్నులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ట రేటు అయిన 28 శాతమే పన్ను అమలవుతుందని.. ప్రస్తుతం అయితే వాటి విక్రయ ధరలో 60 శాతం వరకు పన్ను అమలవుతున్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు చారిత్రక గరిష్టాలకు చేరడంతో ధరలు దిగివచ్చేందుకు జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తుండడం తెలిసిందే. ప్రతిపక్ష నేతలు బహిరంగంగా ప్రకటనలు అయితే ఇస్తారు కానీ.. ఈ అంశాలను జీఎస్‌టీ కౌన్సిల్ ముందు ప్రస్తావించరంటూ ఆయన విమర్శించారు.
జీఎస్‌టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో సుశీల్ ఈ విమర్శ చేశారు. బిహార్ మంత్రిగా పనిచేసిన సమయంలో జీఎస్‌టీ కౌన్సిల్‌కు సుశీల్ ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రాలు ముందుకు వస్తే తదుపరి జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ కిందకు తీసుకురావడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ మంగళవారం ప్రకటన చేసిన విషయం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment