
ఓ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు సంస్థ కొనుగోలు చేస్తే నలువైపులా విమర్శలు చుట్టుముడతాయి. కానీ ఎయిరిండియాను టాటా గ్రూపు టేకోవర్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వ్యక్తమైంది. టాటా గ్రూపుపై ప్రజలు నమ్మకం చూపించారు. ఇప్పుడా నమ్మకాన్ని నిజం చేసే పనిలో మొదటి అడుగు పడింది.
అప్పుల భారంతో కూరుకుపోయిన ఎయిరిండియాను కేంద్రం టాటా గ్రూపుకి అమ్మేసింది. అప్పటికే ఎయిరిండియా నెత్తిన ముప్పై వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. టేకోవర్ కోసం సుమారు రెండు వేల కోట్ల రూపాయలను టాటా గ్రూపు ఖర్చు పెట్టింది. 2022 జనవరి 27న అధికారికంగా ఎయిరిండియా టాటా గ్రూపు చేతిలోకి వచ్చింది. ఇలాంటి సందర్భంలో వెంటనే లాభాల్లోకి సంస్థను తీసుకురావడంపై ఇతర మేనేజ్‌మెంట్లు దృష్టి పెడతాయి. కానీ టాటా ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ముందుగా ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించింది.
ఇదీ నేపథ్యం
బ్రిటీష్ జమానాలో అమల్లోకి వచ్చిన పీఎఫ్ యాక్ట్ 1925 పరిధిలో ఉండే ఉద్యోగులకు పెన్షన్ స్కీం, ఇన్సురెన్సు స్కీమ్‌లు తప్పనిసరిగా అమలు కావు. ఇవి సౌకర్యాలు కావాలంటే ఉద్యోగులు స్వచ్చంధంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ 1952లో మొదటి సారి ఆ తర్వాత కాలంలో 1976, 1995లో పలు సార్లు సవరణలు చేశారు. దీంతో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక సౌకర్యాలు ఇందులో కల్పించబడ్డాయి. అయితే ఎయిరిండియా మాత్రం ఎప్పటి నుంచో 1925 పీఫ్ యాక్టు పరిధిలోనే కొనసాగుతూ వస్తోంది.
గతంలో నిర్లక్ష్యం
టాటాల నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి 1953లో ఎయిర్ ఇండియా వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌గా విడిపోయింది. అనతి కాలంలోనే తిరిగి ఆ రెండు సంస్థలు ఏకమయ్యాయి. ఇలా అనేక సందర్భాల్లో ఉద్యోగుల పీఎఫ్‌ల విషయంలో సంస్థాగతంగా పెద్ద కసరత్తే జరిగింది. కానీ ఉద్యోగులకు మేలు జరిగేలా పాత చట్టం పరిధి నుంచి కొత్త చట్టం పరిధిలోకి తెచ్చే చర్యలు ఏనాడు చోటు చేసుకోలేదు. కానీ టాటా గ్రూపు ఎయిరిండియాను అధికారికంగా టేకోవర్ చేయకముందే ఉద్యోగుల సంక్షేమంపై కీలక నిర్ణయం తీసుకుంది.
సొంతం కాకముందే..
ఎయిరిండియాలో ఉన్న 7,453 మంది ఉద్యోగులను పీఎఫ్ యాక్ట్ 1925 నుంచి ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ 1952 పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు సంస్థను టేకోవర్ చేయడానికి ముందే జనవరి 13న ఎయిరిండియా చేత దరఖాస్తు చేయించింది. టాటాల టేకోవర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ఉద్యోగులను పీఎఫ్ యాక్టు 1925 నుంచి ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ 1952 పరిధిలోకి మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
EPFO onboards Air India for social security coverage.
— EPFO (@socialepfo) January 29, 2022
Click below for more details:https://t.co/rdI0jyECOq pic.twitter.com/EKFSku74il
ప్రయోజనాలు
- ఉద్యోగ విరమణ తర్వాత కనీసం రూ. 1000 పెన్షన్ అందుతుంది. ఒకవేళ సర్వీసులో ఉండగా ఉద్యోగి చనిపోతే అతని కుటుంబ సభ్యులకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ అందివ్వడం ప్రభుత్వ బాధ్యత. గతంలో ఈ సౌకర్యం లేదు.
- ఈపీఎఫ్‌వో చందాదారుడు చనిపోతే ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగుల కేటగిరీలను బట్టి రూ. 2.50 నుంచి రూ.7 లక్షల మొత్తం నష్టపరిహారంగా అందిస్తారు.
- ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో కంపెనీ నుంచి 2 శాతం మొత్తం అంటే 12 శాతం జమ అవుతుంది. పాత చట్టంలో పది శాతం ఉద్యోగి కంట్రిబ్యూషన్‌గా ఉంటే పదిశాతం కంపెనీ కంట్రిబ్యూషన్‌గా ఉండేది. ఇప్పుడు కంపెనీ కంట్రిబ్యూషన్ 12 శాతానికి పెరిగింది. ఈ మేరకు విరమణ తర్వాత పీఎఫ్ మొత్తం అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment