డ్రోన్ పరిశ్రమ పురోగతికి ప్రభుత్వ సహకారం
డ్రోన్ పరిశ్రమ పురోగతికి కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం ఎంతో ఉపయోగపడుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వ శాశ్వత సబ్సిడీగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. న్యూదిల్లీలో పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పీఎల్‌ఐ పథకాన్ని పరిశ్రమలు శాశ్వత సబ్సిడీగా పరిగణించకూడదు. ఆయా రంగాలను ఈ సబ్సిడీపై ఆధారపడేలా చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇది వాటి పురోగతికి అందించే ప్రోత్సాహకం మాత్రమే. డ్రోన్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతిక పురోగతి రైతులకు అధిక నాణ్యత గల పంటలను అందించాలి. పంటల దిగుబడిని పెంచేలా సహకరించాలి. అందుకు అనువుగా మరిన్ని పరిశోధనలు జరగాలి. గ్రామ స్థాయిలో డ్రోన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసి మహిళా సాధికారత కల్పించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం ప్రధానమంత్రి ‘నమో డ్రోన్ దీదీ’ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్‌డీఏ కూటమి మూడో టర్మ్ పరిపాలనలో మూడు రెట్లు వేగంతో పని చేస్తాం. మూడు రెట్ల ఫలితాన్ని అందిస్తాం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం
‘గ్రామ స్థాయిలో డ్రోన్‌ల వాడకం వల్ల సహకార రంగం, స్వయం సహాయక బృందాలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)లకు ఆదాయం సమకూరుతుంది. వీటికి డ్రోన్‌లు అందించేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ పరిశ్రమలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి 2024 ప్రథమార్థంలో 18 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లకు అనుమతులిచ్చాం. 2023లో 17 కంపెనీలు మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి’ అని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment