
దేశంలోని ముఖ్య నాయకుల రక్షణ విషయంలో ఆయా దేశాల భద్రత సిబ్బంది తీసుకునే చర్యలు మామూలుగా ఉండవు. ఇక దేశాధక్షులు, ప్రధానుల సెక్యూరిటీ విషయంలో అయితే నో కాంప్రమేజ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకు తగ్గట్టే భారత ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో మరో పవర్‌ఫుల్, సేఫెస్ట్ కారు వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ వాహనం అత్యంత భద్రతనివ్వడమే కాదు ప్రపంచంలో ఖరీదైన కార్లలో ఒకటిగా నిలుస్తోంది.
మెర్సిడెజ్-మేబ్యాక్ ఎస్650
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత ప్రధానికి భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి రాజీకి చోటివ్వదు. శత్రువుల దాడులను తట్టుకునేలా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా రక్షణ కల్పించే విధంగా సెక్యూరిటీ, సేఫ్టీ కార్లలో ఉంటాయి. ఇప్పడు ప్రధాని తన కాన్వాయ్‌లో భాగంగా మెర్సిడెజ్-మేబ్యాక్ ఎస్650 (Mercedes-Maybach S650) వచ్చి చేరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్వాగతం పలుకుతున్నప్పుడు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ దగ్గర తొలిసారిగా కొత్త మేబ్యాక్ 650లో ప్రయాణం చేస్తూ మోదీ కనిపించారు. తాజాగా మోదీ కాన్వాయ్‌లో ఈ వాహనం మరోసారి ప్రత్యక్షమైంది.
ప్రధాని అంటే ఆ లెక్కే వేరు
భారత ప్రధానితో పాటుగా, ముఖ్య నాయకుల భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) పర్యవేక్షిస్తుంది. ప్రధాన మంత్రితో సహా ఆయా నాయకుల కాన్వాయ్‌లో వాడే వాహనాలను ఎస్‌స్పీజే దగ్గర ఉండి ఎంపిక చేస్తుంది. ముందుగా ఆయా కార్ల సెఫ్టీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే ఎస్పీజీ ఓకే చెప్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో ఇప్పటికే రేంజ్ రోవర్, ల్యాండ్ క్రూయిజర్, బీఎమ్‌డబ్ల్యూ-7 సిరీస్‌లు ఉండగా తాజాగా మెర్సిడెజ్ మేబ్యాక్ వచ్చి చేరింది. ఇప్పుడా కారు విశేషాలు ఏంటో చూద్దాం.
పవర్‌ఫుల్ బాడీ..!
మెర్సిడెజ్ మేబ్యాక్ S650 గార్డ్ డిజైన్, బాడీ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ స్టీల్‌తో తయారు చేస్తారు. లిమోసిన్ విండోస్ లోపలి భాగంలో పాలికార్బోనేట్ కోటింగ్‌తో వస్తాయి. ల్యాండ్‌మైన్స్ నుంచి రక్షణ కోసం అండర్ బాడీలో భారీ అర్మర్స్‌ని పొందుపరిచారు. ఎవరైనా విషవాయువుతో దాడి చేసినా లోపల ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం కలగకుండా స్వచ్ఛమైన గాలి అందించే ప్రత్యేక ఏర్పాటు ఈ కారు సొంతం.
ఎటాక్ ప్రూఫ్
ప్రధాని కాన్వాయ్‌లో రెండు మేబ్యాక్ ఎస్650 గార్డ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాన్వాయ్‌లో ఎప్పుడూ రెండు కార్లు ఉంటాయి. అయితే ప్రధాని ఏ కారులో ప్రయాణించే విషయం అక్కడున్న సిబ్బందికి తప్ప ఎవ్వరికీ తెలియనివ్వరు. రక్షణ చర్యలో భాగంగా ఈ పద్దతిని నేతలందరికీ వర్తింప చేస్తుంటారు. ఇక కారు ఫీచర్ల విషయానికి వస్తే ఎస్600 గార్డ్ కారులాగే S650 గార్డ్ కూడా డైరెక్టివ్ బీఆర్‌వీ 2009 వెర్షన్ (శత్రుదుర్భేధ్యమైన శ్రేణి) 2 ప్రకారం వీఆర్10 రక్షణ స్థాయిని అందిస్తుంది. వెహికల్ సెఫ్టీకి సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక సెఫ్టీ రేటింగ్ ఇదే. వీఆర్10 రేటింగ్ ఉండటంతో ఈ కారు బాడీ, విండోస్ బుల్లెట్‌లను తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది. అంతేకాకుండా ఎక్స్‌ప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్ (ERV) విషయంలో 2010 రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతో రెండు మీటర్ల దూరంలో 15 కిలోల టీఎన్‌టీలాంటి శక్తివంతమైన పేలుడు సంభవించిన కారులో ఉన్నవారికి భద్రత లభిస్తుంది.
ఫైర్‌ప్రూఫ్
ఫ్యూయల్ ట్యాంక్ ఒక ప్రత్యేక పదార్థంతో పూత ఉండగా...ఇది ఒకవేళ ఎదైనా మంటలు వ్యాపించినట్లయితే వెంటనే ఆటోమోటిక్‌గా ఫ్యూయల్ వాల్వ్ మూసుకుపోతాయి. ఇందు కోసం బోయింగ్ AH-64 అపాచీ హెలికాప్టర్ వాడే మెటిరియల్‌ను ఉపయోగించారు. దీంతో ఈ వాహనంలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేదు. భారీ ఆర్మర్డ్ కారు 6.0-లీటర్ V12 ట్విన్ టర్బోచార్జ్డ్ ఇంజన్ నుంచి శక్తిని పొందుతుంది, ఇది గరిష్టంగా 523 బీహెచ్‌పీ శక్తిని, 830 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ధర ఎంతో తెలుసా ?
ప్రముఖ లగ్గరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ప్రపంచంలోని ముఖ్యమైన నాయకుల కోసం హై సెఫ్టీ వాహనాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లోని మెర్సిడెజ్-మేబ్యాక్ ఎస్650 2019లో విడుదలైంది. కొత్తగా వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రధాని కాన్వాయ్‌లో వాడుతున్నారు. గత సంవత్సరం భారత్‌లో మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాక్ S600 గార్డ్‌ను రూ. 10.5 కోట్ల ధరతో విడుదల చేసింది. కాగా కొత్త వెర్షన్ S650 ధర రూ. 12 కోట్ల కంటే ఎక్కువే ఉండనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: RRR: ఇంగ్లాండ్ బైక్‌పై..ఇండియన్ టైగర్ ఎన్టీఆర్...!
Comments
Please login to add a commentAdd a comment