కార్ల కంపెనీల ఆఫర్ల ‘వర్షం’
భారీగా ధరల తగ్గింపు...
ఆకర్షించే ఎక్సే్ఛంజ్ స్కీమ్‌లు
రాత్రి వరకు షోరూమ్‌లు బార్లా
సేల్స్ పెంచుకునే వ్యూహాలు
వానాకాలం వచ్చేసింది. దీనికి తోడు కార్ల కంపెనీల ఆఫర్ల వర్షం కూడా మొదలైపోయింది. అయితే, ఈ ఏడాది డిస్కౌంట్ల మోత మరింతగా మోగుతోంది. సార్వత్రిక ఎన్నికలు, మండుటెండల దెబ్బకు వేసవి సీజన్‌లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. షోరూమ్‌లకు కస్టమర్ల రాక కూడా భారీగా తగ్గిపోయింది. మరోపక్క, వర్షాకాలంలో విక్రయాల తగ్గుదల కూడా పరిపాటే.
ఈ పరిస్థితిని మార్చేందుకు, ఏదో రకంగా విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీలు పలురకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. భారీ డిస్కౌంట్ ధరలతో ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభ స్థాయి మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. పాత కార్ల ఎక్సే్ఛంజ్‌పై మంచి ధర, అదనపు బోనస్, బహుమతులను కూడా అందిస్తున్నాయి.
బలహీన సీజన్...
పండుగలు పెద్దగా లేకపోవడంతో పాటు, వర్షాలు ఎప్పుడు పడతాయో ఊహించని పరిస్థితులు ఉంటాయి. దీంతో కస్టమర్లు ఈ సీజన్‌లో కొనుగోళ్ల ప్రణాళికలను వాయిదా వేసుకుని.. దసరా, దీపావళి సమయాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తుంటారు. అందుకే ఏటా వర్షాకాలంలో అమ్మకాలు పెంచుకునేందుకు దేశవ్యాప్తంగా డీలర్లు డిస్కౌంట్లు, ఇతరత్రా స్కీమ్‌లను అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మోడల్ కార్లపై రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది వర్షాకాలం కంటే ఈ ఏడాది డిస్కౌంట్లు కూడా పెరిగాయి. వేసవిలో విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోయాయి. వీటిని తగ్గించుకోవాలంటే డీలర్లు విక్రయాలు పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
డబుల్ బెనిఫిట్...
డిమాండ్ పెంచేందుకు కార్ల కంపెనీలు.. స్టాక్‌ను తగ్గించుకునేందుకు డీలర్ల స్థాయిలోనూ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ‘గతేడాది ఇదే సీజన్‌లో కొన్ని కార్ల మోడళ్లకు కొరత నెలకొంది. వెయిటింగ్ వ్యవధి కూడా పెరిగింది. కానీ, ఈ ఏడాది చాలా మోడళ్లు డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇదే కస్టమర్లకు ఆఫర్లు పెంచేందుకు కారణం’ అని ఫాడా ప్రెసిడెంట్ మనీ‹Ùరాజ్ సింఘానియా తెలిపారు. మారుతీ ఆల్టో కే10పై రూ.40 వేలు, ఎస్–ప్రెస్సో, వ్యాగన్‌ఆర్‌పై రూ.25,000–30,000, స్విఫ్ట్ మోడళ్లపై రూ.15,000–20,000 వరకు తగ్గింపు ఆఫర్లు నడుస్తున్నాయి. బాలెనో పెట్రోల్ ఎంటీ వెర్షన్‌పై రూ.35 వేలు, పెట్రోల్ ఏజీఎస్ వెర్షన్‌పై రూ.40 వేల వరకు, ఎక్స్‌ఎల్6 పెట్రోల్ వేరియంట్‌పై 20 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.15 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.
ఉచిత విదేశీ ట్రిప్..!
‘హోండా మ్యాజికల్ మాన్సూన్’ పేరుతో హోండా కార్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని కార్లపై బహుమతులు, ఇతర ప్రయోజనాలను ఇందులో భాగంగా అందిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో కొనుగోలుదారుల నుంచి విజేతలను ఎంపిక చేసి, వారికి స్విట్జర్లాండ్ ఉచిత పర్యటన, రూ.75,000 వరకు నగదు బహుమతులను ఆఫర్ చేస్తోంది. హోండా కారు కొనుగోలుపై ఈ పరిమిత కాల ఆఫర్ తమ డీలర్లందరి వద్దా అందుబాటులో ఉన్నట్టు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు.
ఆఫర్ సూపర్...
→ ఎంఅండ్‌ఎం ఎక్స్‌యూవీ400 (ఈవీ) – రూ. 4 లక్షలు
→ మారుతి జిమ్నీ ఆల్ఫా వేరియంట్ – రూ. 2 లక్షలు
→ హోండా అమేజ్, సిటీ, ఎలివేట్, సిటీ ఈ–హెచ్‌ఈవీ – రూ. 75,000 వరకు
→ టాటా టియాగో, ఆ్రల్టోజ్, నెక్సాన్, పంచ్, హ్యారియర్, సఫారీ – రూ. 50,000 వరకు
→ అధిక డిమాండ్ ఉండే ఎస్‌యూవీలపై తగ్గింపు కొంతే
→ ఆరంభ మోడళ్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు
→ ఎక్స్‌చేంజ్‌పైనా అదనపు బోనస్
→ సాధారణ రోజుల్లో ఎస్‌యూవీలకు 60 రోజుల వెయిటింగ్
→ ఈ సీజన్‌లో 30 రోజుల్లోనే డెలివరీ
→ పండుగల ముందు వరకు ఇదే ధోరణి
Comments
Please login to add a commentAdd a comment