ముంబై: పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారం కుటుంబాల బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై ప్రభావం చూపుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరిశోధనా పత్రం ఒకటి పేర్కొంది. ద్రవ్యోల్బణం అంచనాలు గృహాల వినియోగం తీరు, తత్ఫలితంగా పొదుపులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆర్‌బీఐ వర్కింగ్ పేపర్ అభిప్రాయపడింది. భారత్‌లోని కుటుంబాలపై ద్రవ్యోల్బణం అంచనాలు, ప్రభావం అన్న అంశంపై దేవేంద్ర ప్రతాప్ సింగ్, ఆదిత్య మిశ్రా, పూర్ణిమా షాలు ఈ పరిశోధనా పత్రాన్ని విడుదల చేశారు. అయితే రచయితల అభిప్రాయాలతో ఆర్‌బీఐ ఏకీభవించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. డాక్యుమెంట్‌లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
- భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ విషయంలో కుటుంబాలు రుణం లేదా ఈక్విటీ వంటి ఆర్థిక సాధనాల్లో పొదుపు చేయడం మంచిది. ఇది ఉత్పత్తిని పెంచే కార్యకలాపాలలో మరింతగా ఉపయోగపడుతుంది.
- ద్రవ్యోల్బణం తీవ్రత వల్ల పొదుపులు పడిపోయే ప్రభావం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది.
- కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ల అభివృద్ధి ఇంకా ప్రారంభ దశ లోనే ఉంది. ఈక్విటీ మార్కెట్‌లపై తక్కువ అవగాహనా ఉంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, చాలా భారతీయ కుటుంబాలకు అందుబాటులో ఉండే ఆర్థిక సాధనం ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లే. ద్రవ్యోల్బణం తీవ్రమైతే వీటిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు తప్పకపోవచ్చు.
- ద్రవ్యోల్బణం పెరుగుతుందని కుటుంబాలు భావించే పక్షంలో వడ్డీరేట్ల తక్కువగా ఉండడం, ప్రతికూల రిటర్న్స్ వల్ల గృహాలు డిపాజిట్లకు దూరంగా ఉండే వీలుంది. దీనితో వారు టర్మ్ డిపాజిట్లలో పొదుపు చేయడం కంటే విలువైన లోహాలు, ఆభరణాలు మొదలైన వాటిపై పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని భావించే అవకాశం ఉంది.
- భారత్‌తో పాటు అమెరికా, ఇంగ్లండ్, జపాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, చెక్ రిపబ్లిక్, ఫిలిప్పీన్స్, రష్యా వంటి ఇతర దేశాలలో కూడా ద్రవ్యోల్బణం అంచనాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. భారతీయ కుటుంబాల ద్రవ్యోల్బణం అంచనాలు ఇతర అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే ఉన్నాయన్న విషయాన్ని ఇది సూచిస్తోంది.
- ద్రవ్యోల్బణం అంచనాలలో మార్పులు తప్పనిసరిగా ఏదైనా నిర్దిష్ట ఆహార వస్తువుపైనే ప్రభావం చూపబోవు. వినియోగదారుల ధరల సూచీలో వివిధ ఉత్పత్తుల్లో ధరల మార్పులు ‘ఆయా ఉత్పత్తుల వెయిటేజ్‌తో సంబంధం లేకుండా’ వివిధ సమయాల్లో వినియోగానికి సంబంధించి కుటుంబాల మనోభావాలను ప్రభావితం చేస్తాయి. ఏదైనా ఒక వస్తువు ధర హఠాత్తుగా పెరిగితే, దామాషా ప్రాతిపదికన మొత్తం వినియోగ ప్రవర్తనపై ఆ ప్రభావం పడుతుంది.
- ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, భారత్‌లో ప్రస్తుతం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ స్థాయి వడ్డీరేట్ల వల్ల బ్యాంకింగ్‌లో ఇప్పటికే ప్రతికూల రిటర్న్స్ వస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్‌బీఐ పరిశోదనా పత్రం వెలువడ్డం గమనార్హం.
చదవండి:ముత్తూట్ విభాగానికి షాక్.. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ రద్దు!
Comments
Please login to add a commentAdd a comment