న్యూఢిల్లీ: దేశంలో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరాల్లో గృహాలకు డిమాండ్ బలంగా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ తెలిపింది. అధికంగా ఉన్న యువత, వారి ఆర్థిక శక్తి సామర్థ్యాల పురోగతి, గృహ రుణాలపై సాపేక్షంగా కొనుగోలుదారులు తక్కువ ఆధారపడటం వంటి అంశాలు ఇందుకు కారణమని సంస్థ ఎండీ విపుల్ రూంగ్తా శుక్రవారం తెలిపారు. రుణం తీసుకోకుండానే మూడింట ఒక వంతు గృహాలు అమ్ముడవుతున్నాయని చెప్పారు. గత ఆరు నెలల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు కఠినతరం అయినప్పటికీ భారతదేశ గృహ మార్కెట్ బలమైన డిమాండ్‌ను సాధిస్తోందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో భాగంగా ఈ ఏడాది మే నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 190 బేసిస్ పాయింట్లు పెంచిందని గుర్తుచేశారు. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి 8 శాతానికిపైగా ఎగశాయని తెలిపారు.
పెరిగినా, తగ్గినా కొంటారు..
మధ్య, తక్కువ ఆదాయ గృహాలు మాత్రమే కాకుండా ప్రీమియం, అల్ట్రా–ప్రీమియం విభాగంలో కూడా విపరీతమైన డిమాండ్ ఉండబోతోందని విపుల్ అన్నారు. సొంత ఇంటిని కలిగి ఉండాలన్న తపన ప్రజల్లో పెరుగుతోందని వివరించారు. ‘భారతదేశంలో గృహ యజమానుల సగటు వయస్సు 37 సంవత్సరాలు. దేశంలో మూడింట రెండు వంతుల మంది ఇప్పటికీ 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. కాబట్టి చాలా స్పష్టంగా, తీవ్రమైన డిమాండ్ ఉండబోతోంది. నిర్మాణ సంస్థలు సద్వినియోగం చేసుకోవాలి. కస్టమర్లు వడ్డీ రేటు తగ్గితేనే ఇల్లు కొనాలని చూడడం లేదు. వడ్డీ పెరిగినంత మాత్రాన కొనుగోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవట్లేదు. ఇంటి విలువలో రుణ భాగం 68 శాతం మించడం లేదు. అంటే 30–32 శాతం మొత్తాన్ని సొంత నిధులను సమకూరుస్తున్నారు. భారతదేశంలో ఉన్న తనఖాల విలువ దాదాపు రూ.24,66,000 కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో 11 శాతం’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment